Spirulina | ప్రకృతి మనకు ఎన్నో రకాల పోషకపదార్థాలను అందజేసింది. వాటిల్లో చాలా వరకు పోషక పదార్థాలను మనం తరచూ తింటూనే ఉన్నాం. అయితే కొన్ని రకాల ఆహారాలను సూపర్ ఫుడ్‌గా చెబుతుంటారు. ఎందుకంటే అలాంటి ఆహారాల్లో పోషకాలు అత్యధిక శాతంలో ఉంటాయి. అలా సూపర్ ఫుడ్‌గా పిలవబడే ఆహారాలు చాలా తక్కువగానే ఉన్నాయి. వాటిల్లో స్పిరులినా కూడా ఒకటి. ఇది ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఒక సముద్రపు మొక్క. ఆల్గే జాతికి చెందినది. సముద్ర గర్భంలోనే ఈ మొక్క పెరుగుతుంది. అయితే ఈ మొక్క ఆకుల్లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. ఈ ఆకులు అనేక పోషకాలను కలిగి ఉంటాయి. కనుకనే స్పిరులినాను సూపర్ ఫుడ్‌గా చెబుతుంటారు. స్పిరులినా మనకు బయట మందుల షాపుల్లో ట్యాబ్లెట్లు, పొడి రూపంలో లభిస్తుంది. ఈ క్రమంలోనే స్పిరులినాను వాడడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
స్పిరులినాలో ఫైకోసయనిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ఆక్సీకరణ ఒత్తిడి, వాపులను తగ్గిస్తుంది. దీని వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. స్పిరులినాను తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. స్పిరులినాను తీసుకోవడం వల్ల అలర్జీల నుంచి ఉపశమనం లభిస్తుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో తేలింది. దీన్ని తీసుకుంటే జ్వరం, ముక్కు కారడం, తుమ్ములు, దురద, వాపులు వంటి అలర్జీ సమస్యలు తగ్గుతాయి. స్పిరులినా డయాబెటిస్ ఉన్నవారికి కూడా మేలు చేస్తుంది. దీన్ని రోజూ తీసుకుంటే శరీరం ఇన్సులిన్‌ను మెరుగ్గా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ఈ విషయాన్ని సైంటిస్టులు తమ అధ్యయనాల ద్వారా తేల్చారు. దీని వల్ల ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది.
స్పిరులినాను తీసుకుంటే రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. తెల్ల రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో ఇన్ఫెక్షన్లు, వ్యాధులు తగ్గుతాయి. ముఖ్యంగా సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు. స్పిరులినాలో ఐరన్ అత్యధిక శాతం ఉంటుంది. కనుక దీన్ని తీసుకుంటే ఐరన్ లభించి రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది. రక్తహీనత ఉన్నవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. స్పిరులినాను తీసుకోవడం వల్ల కండరాలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. శారీరక శ్రమ, వ్యాయామం చేసే వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఈ విధంగా స్పిరులినా వల్ల మనం అనేక లాభాలను పొందవచ్చు.
స్పిరులినాను వైద్యులు లేదా పోషకాహార నిపుణుల పర్యవేక్షణలో తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని రోజుకు 3 గ్రాములకు మించి తీసుకోకూడదు. డాక్టర్లు ముందుగా దీన్ని తక్కువ డోసులో ఇచ్చి తరువాత క్రమంగా పెంచుతారు. మార్కెట్లో నకిలీ స్పిరులినాను అమ్మే బ్రాండ్లు అనేకం ఉన్నాయి. కనుక బ్రాండెడ్ కంపెనీలు విక్రయించే స్పిరులినాను కొనుగోలు చేయడం ఉత్తమం. ఆర్థరైటిస్ ఉన్నవారు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, రక్తాన్ని పలుచగా చేసే మందులను వాడుతున్నవారు స్పిరులినాను తీసుకోకూడదు. ఈ విధంగా జాగ్రత్తలను పాటిస్తూ దీన్ని రోజూ తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.