Spices Side Effects on Skin | భారతీయ వంటింట్లోని సుగంధ ద్రవ్యాలు ఆహారం రుచిని పెంచడానికి మాత్రమే కాదు.. చర్మ సంరక్షణలోనూ విస్తృతంగా ఉపయోగిస్తారు. చాలామంది ముఖానికి సుగంధ ద్రవ్యాలను వినియోగించి చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో పలువురు పొరపాట్లు చేస్తుంటారు. కొన్ని సుగంధ ద్రవ్యాలు చర్మానికి రాసినప్పుడు ఇబ్బందులు పడాల్సి వస్తుందని చాలా మందికి తెలియదు. పలు సుగంధ ద్రవ్యాల్లోని ఘాటైన పదార్థాలు చర్మంపై పొరను దెబ్బతిస్తాయి. చర్మం ఎర్రబారడంతో పాటు దురద వస్తుంది. కొన్నిసార్లు దద్దుర్లు వస్తాయి. కొన్నిసార్లు అలెర్జీకి కారణమవుతాయి. దాంతో వైద్యుడికి వద్దకు వెళ్లాల్సి వస్తుంది. మీరు ఇంట్లోనే ఫేస్ ప్యాక్‌లను తయారు చేసుకొని వేసుకుంటుంటే.. ఎలాంటి సుగంధ ద్రవ్యాలకు దూరంగా ఉండాలో తెలుసుకోవడం ఉత్తమం.
చాలా మంది దాల్చిన చెక్కను ముఖానికి ప్యాక్‌లా వేసుకునేందుకు ఇష్టపడుతుంటారు. ఎందుకంటే ఇది యాంటీ బ్యాక్టీరియల్. కానీ దాని వేడి లక్షణాలు చర్మం పైపొరను దెబ్బతీస్తాయి. సిన్నమాల్డిహైడ్ సమ్మేళనం చర్మంపై చికాకు, ఎరువు ఎర్రబారడం, వాపునకు కారణమవుతుంది. చర్మం సున్నితంగా ఉంటే దాల్చిన చెక్కను వాడకుండా ఉండడం మంచిది.
లవంగా నూనెను తరచుగా మొటిమలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. దాన్ని చర్మంపై నేరుగా ఉపయోగించడం వల్ల కాలిపోతుంది. బొబ్బలు వస్తాయి. లేదంటే చికాకును కలిగిస్తుంది. లవంగాల నూనె లేదంటే పొడిని నేరుగా చర్మానికి రాయకుండా కొబ్బరి నూనె, కలబంద జెల్ వంటి క్యారియర్ ఆయిల్‌తో కలిపి రాసుకోవడం ఉత్తమం.
ఇంగువా (ఆసాఫోటిడా)లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుంటాయి. కానీ, దాన్ని ముఖానికి రాయడం వల్ల పలుసార్లు చికాకుకు కారణమవుతుంది. కొన్నిసార్లు అలెర్జీ వస్తుంది. చర్మంపై దద్దర్లు వస్తాయి. ముఖ్యంగా పొడి, సున్నితమైన చర్మం ఉంటే.. ముఖానికి నేరుగా రాయకపోవడం మంచిది.
ఆవాల పొడిలో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. దాన్ని ముఖానికి రాకపోవడమే మంచిది. నేరుగా చర్మంపై రాస్తే దద్దుర్లు రావడంతో పాటు మచ్చలకు కారణమవుతుంది. ఇంట్లో తయారుచేసిన ఫేస్ ప్యాక్‌లో కలపాలని భావిస్తే.. చాలా తక్కువ పరిమాణంలో వాడాలి. చర్మానికి రాసే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది.