అందమైన చిరునవ్వుకు మిలమిలలాడే దంతసిరి చాలా ముఖ్యం. చాలామందిలో ముందు దంతాలు నల్లగా మారడం, మురికి పట్టినట్లు అసహ్యకరమైన పసుపు రంగులోకి మారడం మనం చూస్తుంటాం. దంత క్షయానికి కేవలం పంటి పురుగులు లేదా క్యావిటీలు మాత్రమే కారణం అనుకుంటే పొరపాటే. దీని వెనుక మన దైనందిన జీవితంలో భాగమైన కొన్ని చెడు అలవాట్లు దాగి ఉన్నాయి. సాధారణంగా దంతాల్లో తీవ్రమైన అసౌకర్యం కలగనంత వరకు చాలామంది వాటి ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు. కానీ, కొన్ని అలవాట్లు లోపలి నుంచి దంతాలను క్రమక్రమంగా అరిగేలా చేస్తాయి. దీనివల్ల పళ్లు బలహీనపడి, ఊడిపోయే స్థితికి చేరుకుంటాయి. ఇలాకాకుండా మన దంతాలను రక్షించుకునేందుకు వెంటనే మానుకోవాల్సిన అలవాట్లను తెలుసుకుందాం..
గట్టిగా బ్రష్ చేయడం: కొంతమంది దంతాలు తెల్లగా మెరవాలనే ఆరాటంతో బ్రష్‌ను పళ్లపై వేసి గట్టిగా రుద్దుతుంటారు. ఎకువ సమయం పాటు బ్రష్ చేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎకువ. ఇలా చేయడం వల్ల దంతాలను రక్షించే ఎనామెల్ పూర్తిగా అరిగిపోతుంది. ఫలితంగా దంతాల్లో సున్నితత్వం ఏర్పడి చల్లటి లేదా వేడి పదార్థాలు తిన్నప్పుడు పళ్లు జివ్వుమనడం మొదలవుతుంది.
ఓపెనర్లా వాడటం: పళ్లను కేవలం ఆహారం నమలడానికి మాత్రమే ఉపయోగించాలి. కానీ. చాలామంది దంతాలను కత్తెరలానో, క్యాప్ ఓపెనర్లాగో భావిస్తుంటారు. దంతాలతో కూల్ డ్రింక్ బాటిల్ మూతలు తీయడం, ప్లాస్టిక్ ప్యాకెట్లు లేదా చిప్స్ ప్యాకెట్లను చింపడం, టేపులను కత్తిరించడం వంటి పనులు చేస్తుంటారు. ఈ ఒత్తిడి వల్ల దంతాలపై మైక్రో ఫ్రాక్చర్స్ ఏర్పడి పళ్లు ముకలయ్యే ప్రమాదం ఉంది.
వాటి వల్ల కూడా: రోజంతా ఏదో ఒకటి తింటూనే ఉండటం లేదా పదేపదే టీ, కాఫీలు తాగడం పళ్లకు అస్సలు మంచిది కాదు. మనం తిన్న ప్రతిసారీ నోటిలో యాసిడ్స్ విడుదలవుతాయి. ఈ యాసిడ్ ఉత్పత్తి నిరంతరాయంగా సాగి, ఎనామెల్ పొరను కరిగించివేస్తుంది. దీనివల్ల దంతాలు లోపలి నుంచి గుల్లగా మారిపోతాయి.
ప్రమాదం రెట్టింపు: సోడాలు, కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్, ఆలహాల్ లాంటివి తాగడం వల్ల శరీర ఆరోగ్యమే కాకుండా దంతాల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. వీటిలో ఉండే అధిక ఆమ్ల గుణాలు దంతాల ఎనామెల్‌ను క్షీణింపజేసి, పిప్పిపళ్లు లేదా క్యావిటీలు వచ్చే ప్రమాదాన్ని వంద శాతం పెంచుతాయి.
తిన్న వెంటనే: ఆహారం తిన్న వెంటనే బ్రష్ చేయడం సరైంది కాదు. మనం ఏదైనా తిన్నప్పుడు దంతాల ఎనామెల్ పొర కాస్త మెత్తబడుతుంది. ఆ సమయంలో బ్రష్ చేస్తే ఎనామెల్ సులభంగా ఊడిపోతుంది. కాబట్టి ఏదైనా తిన్న తర్వాత కనీసం 30 నిమిషాలు ఆగి బ్రష్ చేయడం లేదా కేవలం నీటితో నోరు పుకిలించడం మంచిది.
ఫ్లాసింగ్ చేయాలి: కేవలం బ్రష్ చేయడంతోనే దంతాల శుభ్రత పూర్తి కాదు. రెండు దంతాల మధ్య ఇరుకుపోయిన ఆహార కణాలను బ్రష్ తొలగించలేదు. ఇందుకోసం డెంటల్ ఫ్లాస్ వాడాలి. ఫ్లాసింగ్ చేయకపోతే ఆ ఆహార కణాలు అకడే కుళ్లిపోయి బ్యాక్టీరియా చేరి ప్లేక్లా మారుతుంది. ఇది చిగుళ్ల వ్యాధులకు, దంతాలు కుళ్లిపోవడానికి ప్రధాన కారణమవుతుంది.