డెంగ్యూ ఫీవర్ వైరల్ ఇన్ఫెక్షన్. దోమలు కుట్టడం వల్ల ఈ సమస్య వస్తుంది. వర్షాకాలంలో ఈ దోమలు ఎక్కువగా కుడతాయి. కాబట్టి ఈ కాలంలో డెంగ్యూ జ్వర బాధితులు ఎక్కువగా ఉంటారు. డెంగ్యూ చాలామందిలో కొద్దిపాటి వ్యాధి లక్షణాలతోనే తగ్గిపోతుంది. శరీరంలో ఉండే సాధారణ రోగ నిరోధక శక్తితో డెంగ్యూ నుంచి కోలుకుంటారు. ఈ సమయంలో పిల్లలు పాఠశాలకు వెళ్లకుండా ఇంటిపట్టునే ఉండాలి. కొబ్బరినీళ్లు, ఓఆర్ఎస్, ద్రవాహారం తీసుకోవాలి. డెంగ్యూ నివారణ కోసం ప్రత్యేకమైన మందులు లేవు. వ్యాధి లక్షణాలను బట్టి చికిత్స చేస్తారు. డెంగ్యూ బారినపడిన కొంతమంది పిల్లల్లో వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. బాగా అస్వస్థతకు గురవుతారు. జ్వరం రెండు, మూడు రోజులు ఉండి తలనొప్పి, రాషెస్, నాసియా ఉందంటే వైద్యులు రక్త పరీక్షకు సిఫారసు చేస్తారు.
పిల్లలు రెండు నుంచి ఏడు రోజులు అధిక జ్వరం, ఒంటిపై దద్దుర్లు, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, నీరసం, వాంతులు లాంటి లక్షణాలతో బాధపడుతుంటే వాళ్లకు డెంగ్యూ సమస్య ఉందని తల్లిదండ్రులు గుర్తించాలి. వైద్యులను సంప్రదిస్తే అవసరమైన రక్త పరీక్షలు చేస్తారు. లక్షణాలను బట్టి మందులతో చికిత్స చేస్తారు.
అతికొద్ది మంది పిల్లల్లో డెంగ్యూ తీవ్రంగా పరిణమిస్తుంది. అప్పుడే పుట్టిన శిశువుల నుంచి ఏడాదిలోపు పిల్లలు, బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంట్, ఒబెసిటీ, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్, లివర్ ట్రాన్స్‌ప్లాంట్, గుండె సమస్యలు, గుండె సర్జరీ, ఇతర వ్యాధులు ఉన్న పిల్లల్లో డెంగ్యూ తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రాణాంతకంగానూ మారుతుంది. డెంగ్యూ తీవ్రమైనప్పుడు పొట్ట నొప్పి ఉంటుంది. బాగా నీరసంగా ఉంటారు. కాళ్లు, చేతులు చల్లబడతాయి. సరిగ్గా తినరు. మూత్రం తక్కువగా వస్తుంది.
ఊపిరి వేగంగా తీసుకుంటారు. ఇలా ఉంటే హాస్పిటల్లో చేర్పించాలి. ఐసీయూ అవసరం పడొచ్చు. సివియర్ డెంగ్యూ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో శరీరంలోని అవయవాలు ఇన్ఫెక్ట్ అవుతాయి. మెదడులో ఇన్ఫెక్షన్ పెరిగితే మెదడువాపు వ్యాధిలా ఉంటుంది. లివర్ కూడా ఇన్ఫెక్షన్కు గురవుతుంది. పొట్టలో, ఛాతీలో నీరు చేరుతుంది. ఐసీయూ సపోర్ట్, మెడికేషన్‌తో పిల్లల్ని డెంగ్యూ నుంచి కాపాడుకోవచ్చు.
దోమల బారినపడకుండా ఉంటే డెంగ్యూ రాదు. దోమలు రాత్రిపూట కుడతాయి. కాబట్టి డెంగ్యూ రాకుండా రాత్రివేళ జాగ్రత్తగా ఉండాలనుకుంటారు. కానీ, డెంగ్యూ కలుగజేసే దోమలు పగటి వేళలో కుడతాయి. సూర్యోదయం తర్వాత రెండు గంటల వరకు, సూర్యాస్తమయానికి రెండు గంటల ముందు డెంగ్యూ కారక దోమలు స్వైరవిహారం చేస్తాయి. కాబట్టి ఆ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆ దోమ కుట్టిన తర్వాత లక్షణాలు బయటపడడానికి నాలుగు నుంచి పది రోజులు పడుతుంది. డెంగ్యూ ఫీవర్ ఒకరి నుంచి మరొకరికి సోకదు. పూర్తిగా కప్పి ఉండే దుస్తులు ధరించాలి. ఇంటి పరిసరాల్లో నీళ్లు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
– డాక్టర్ అనుపమ వై.
సీనియర్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్, హైదరాబాద్