మా అమ్మాయి వయసు పన్నెండేండ్లు. నాలుగు నెలల క్రితమే రజస్వల అయింది. అయితే, నెల రోజులుగా తనకు విపరీతంగా తెల్లబట్ట అవుతున్నది. కొద్దిగా దుర్వాసన కూడా ఉంటుందని చెబుతున్నది. చిన్న వయసులో పెద్ద మనిషి అవ్వడం వల్ల ఇలా జరుగుతున్నదా? దయచేసి చెప్పగలరు.
జ : మహిళల్లో సాధారణంగా వచ్చే తెల్లబట్ట సమస్యను వైట్ డిశ్చార్జ్ అంటారు. అయితే, మీ అమ్మాయికి తెల్లబట్ట ఎక్కువ కావడానికి, తన వయసుకు సంబంధం లేదు. తెల్లబట్ట నీళ్లలా ఉంటూ.. వాసన, దురద లేకుంటే ఎలాంటి ప్రమాదమూ ఉండదు. అయితే, మీ అమ్మాయి విషయంలో వాసన వస్తున్నదని చెబుతున్నారు. దీనికి ఇన్ఫెక్షనే కారణం. ఒక్కోరకమైన ఇన్ఫెక్షన్ వల్ల ఒక్కోరంగు తెల్లబట్ట వస్తుంది. తెల్ల రంగులో వస్తే అది బ్యాక్టీరియల్ వ్జైనోసిస్, ఆకుపచ్చగా ఉంటే ట్రైకోమొనియాసిస్ ఇన్ఫెక్షన్ అని అర్థం. ఇలా ఒక్కో పేషెంట్లో ఒక్కో ఇన్ఫెక్షన్ చూస్తుంటాం. అవసరమైతే, శాంపిల్ తీసుకుని పరీక్ష చేస్తాం. మూత్ర పరీక్ష, అల్ట్రాసౌండ్ పెల్విస్ కూడా నిర్వహిస్తాం. రిపోర్ట్‌లను బట్టి చికిత్స అందిస్తాం. వీలైనంత త్వరగా మీ అమ్మాయిని గైనకాలజిస్ట్ దగ్గరకు తీసుకెళ్లడమే మంచిది.
డా. కావ్యప్రియ వజ్రాల
కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్
యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ