Health News | అన్నం.. పరబ్రహ్మ స్వరూపం! మనం తినే అతిముఖ్యమైన ఆహారం! అయితే.. అన్నాన్ని వండటంలోనూ కొన్ని మెలకువలు పాటించాల్సిందే! లేకుంటే.. అంతగా ప్రయోజనం ఉండదని ఆహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బియ్యాన్ని నానబెట్టి.. వండితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు.
మధుమేహం ఉన్నవారు అన్నం తక్కువ తినాలని వైద్యులు సూచిస్తారు. ఎందుకంటే.. అన్నం ఎక్కువగా తీసుకుంటే, రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి. కానీ, బియ్యాన్ని నానబెట్టడం వల్ల.. అందులోని ‘ైగ్లెసెమిక్ ఇండెక్స్’ తగ్గుతుంది. దీంతో రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి.
బియ్యాన్ని నానబెట్టి.. వంట చేసుకోవడం జీర్ణ వ్యవస్థకూ మంచిది. నానబెట్టిన బియ్యంతో వండిన అన్నం.. త్వరగా అరుగుతుంది. దాంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్ధకం లాంటి సమస్యలూ దూరమవుతాయి.
బియ్యంలో ఉండే ‘ైగ్లెసిమిక్ ఇండెక్స్’ నిద్రను దూరం చేస్తుంది. బియ్యాన్ని నానబెట్టడం వల్ల ఇది తగ్గుతుంది. ఇలా వండిన అన్నం తినడం వల్ల చక్కటి నిద్ర పడుతుంది.
బియ్యంలో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు ఉంటాయి. బియ్యాన్ని నీటిలో నానబెట్టి అన్నం వండటం వల్ల.. ఆయా పోషకాలన్నీ శరీరానికి పూర్తిస్థాయిలో అందుతాయి.
బియ్యం నానబెట్టడం మంచిదే! కానీ, మరీ ఎక్కువసేపు నానబెడితే ఇబ్బందే! అలా చేస్తే పెద్దగా ప్రయోజనం ఉండకపోగా.. బియ్యంలో ఉండే విటమిన్లు, ఖనిజాలు నీటిలో కరిగిపోతాయి. కాబట్టి, బియ్యాన్ని అరగంట సేపు నానబెడితే చాలు.