ధూమపానం ఆరోగ్యానికి హానికరం. దానివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. మరి అదే ధూమపానం మానేసిన నిమిషాల్లోనే శరీరంలో మార్పులు మొదలవుతాయి. అన్నాళ్లూ స్మోకింగ్‌తో వాటిల్లిన నష్టం తగ్గుతూ వస్తుంది.
మొదటి 20 నిమిషాలు: ధూమపానం సమయాన్ని బట్టి చేస్తుంటారు. కొందరు పదినిమిషాలకో సిగరెట్ వెలిగిస్తుంటారు. అంతటి చెయిన్ స్మోకర్లు కూడా ధూమపానానికి స్వస్తి పలికితే తొలి 20 నిమిషాల్లోనే శరీరంలో మార్పు మొదలవుతుంది. రక్తపోటు సాధారణ స్థాయికి వస్తుంది. చేతులు, కాళ్ల ఉష్ణోగ్రత సాధారణ స్థితికి చేరుకుంటుంది.
8 గంటలు: వరుసగా ఎనిమిది గంటలు ధూమపానం జోలికి వెళ్లకుండా ఉంటే, సిగరెట్ల వల్ల శరీరంలోకి వెళ్లిన రసాయనాల స్థాయులు తగ్గిపోతాయి. దాంతో ఆక్సిజన్ సాధారణ స్థాయికి వస్తుంది. అయితే ఎక్కువగా క్రేవింగ్స్ వస్తాయి. అప్పుడు నియంత్రించుకుంటే 10-15 నిమిషాల్లో క్రేవింగ్స్ తగ్గుతాయి. ధూమపానం వైపు మనసు మళ్లినప్పుడు చూయింగ్ గమ్ నమలడమో, నీళ్లు తాగడమో చేయాలి.
12 గంటలు: రోజులో సగం సమయం అయిపోతుంది కాబట్టి గుండె ప్రశాంతంగా, ఆరోగ్యంగా కొట్టుకోవడం మొదలవుతుంది. ముందులా ఆక్సిజన్ కోసం వేగంగా కొట్టుకునే శ్రమ దానికి ఉండదు.
48 గంటలు: రెండు రోజుల తర్వాత రుచి, వాసన వంటివి బాగా పని చేస్తాయి. నరాలన్నీ ఆరోగ్యంగా పని చేసేందుకు సిద్ధమవుతుంటాయి. ఊపిరితిత్తులు అప్పటివరకూ తనలో పేరుకుపోయిన శ్లేష్మాన్ని బయటికి పంపించే పనిలో పడతాయి. దాంతో శరీరంలో నికోటిన్ తరిగిపోతుంది. ఆ సమయంలో ఆకలి, అలసట, తలనొప్పి వంటివి వస్తాయి. దానికోసం డాక్టర్‌ను సంప్రదించి సరైన చికిత్స తీసుకుంటే
సరిపోతుంది.
వారాలు, నెలలు: రోజులు గడుస్తున్న కొద్దీ ఊపిరితిత్తులు పూర్తి ఆరోగ్యాన్ని సంతరించుకుంటాయి. మెల్లిమెల్లిగా వ్యాయామం అలవాటు చేసుకుంటే, గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. స్మోకింగ్‌కు బై చెప్పిన ఏడాదికి గుండెపోటు వచ్చే అవకాశం సగానికి సగం తగ్గుతుంది. అలాగే ఐదేళ్లు వచ్చేసరికి.. ధూమపానం చేయనివారితో సమానంగా గుండె పదిలంగా ఉంటుంది. అలాగే నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా పూర్తిగా తగ్గుతాయి.