Sleeplessness | ప్రస్తుతం నడుస్తున్నది ఉరుకుల పరుగుల బిజీ యుగం కావడంతో అన్నింటిలోనూ అందరూ వేగాన్నే కోరుకుంటున్నారు. ప్రతిదీ వేగంగా కావాలని ఆలోచిస్తున్నారు. ఆ విధంగానే పనులు చేస్తున్నారు. అయితే అంతా బాగానే ఉన్నప్పటికీ నేటి తరం వారికి ఈ ఫాస్ట్ యుగం కారణంగా ఒత్తిడి అధికంగా వస్తోంది. విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు అందరూ ఒత్తిడి బారిన పడుతున్నారు. తాము సరైన ప్రదర్శన చేయకపోతే లేదంటే తమ జాబ్ గురించి చాలా మంది ఆందోళన చెందుతున్నారు. దీంతోపాటు పని ఒత్తిడి కూడా పెరిగిపోయింది. దీని వల్ల చాలా మంది రాత్రిపూట సరిగ్గా నిద్రించడం లేదు.
నిద్రలేమి అన్నది ప్రస్తుతం చాలా మందికి కామన్ అయిపోయింది. ఫోన్ చూస్తూ రాత్రి 12 లేదా 1 గంటకు నిద్రిస్తున్నారు. ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తున్నారు. అయితే ఇలాంటి జీవనశైలి అసలు మంచిది కాదని, రాత్రి త్వరగా నిద్రించి ఉదయం త్వరగా నిద్రలేస్తేనే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. రాత్రి ఆలస్యంగా నిద్రించడం వల్ల అనేక దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. రాత్రి ఆలస్యంగా నిద్రించడం వల్ల మెటబాలిజంపై ప్రభావం పడుతుంది. దీంతో మెటబాలిజం తగ్గుతుంది. ఫలితంగా అధికంగా బరువు పెరుగుతారు. ఇది డయాబెటిస్‌కు దారి తీస్తుంది. దీంతోపాటు రక్త నాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. దీంతో గుండె పోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
నిద్ర వల్ల మన శరీర రోగ నిరోధక వ్యవస్థ పనితీరు ప్రభావితం అవుతుంది. నిద్ర సరిగ్గా పోకపోతే రోగ నిరోధక వ్యవస్థ కూడా సరిగ్గా పని చేయదు. దీంతో ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. ముఖ్యంగా తెల్ల రక్త కణాలు క్రిములతో పోరాడే శక్తిని కోల్పోతాయి. దీంతో రోగాలు సులభంగా వస్తాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తాయి.
రాత్రి ఆలస్యంగా నిద్రించి ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం వల్ల బద్దకంగా మారుతారు. మెదడు పనితీరు మందగిస్తుంది. చురుగ్గా పనిచేయలేరు. ఉత్సాహంగా ఉండరు. దీంతో పనిలో ఉత్పాదకత తగ్గుతుంది. సరిగ్గా పనిచేయలేకపోతారు. అలాగే రోజువారి పనులు చేసేందుకు కూడా బద్దకంగా అనిపిస్తుంది. రాత్రి ఆలస్యంగా నిద్రించడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గుతాయి. మెదడు మొద్దుబారినట్లు అవుతుంది.
రాత్రి పూట ఆలస్యంగా నిద్రిస్తే హార్మోన్లపై కూడా ప్రభావం పడుతుంది. హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దీంతో అధికంగా బరువు పెరిగిపోతారు. మహిళల్లో అయితే పీరియడ్స్ సరిగ్గా రావు. అలాగే ముఖంపై ముడతలు ఏర్పడుతాయి. వృద్ధాప్య ఛాయలు త్వరగా వచ్చేస్తాయి. ఇన్ని దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక రాత్రి త్వరగా నిద్రించి ఉదయం త్వరగా నిద్ర లేచే ప్రయత్నం చేయండి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.