న్యూఢిల్లీ : శారీరక చురుకుదనం (Health Tips) లోపించడం ద్వారా ఊబకాయం, మధుమేహం, హృద్రోగాలు వంటి అనారోగ్యాలతో అకాల మరణం ముప్పు పొంచిఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నాయి. పలు అధ్యయనాలు కూడా చురుకైన జీవనశైలి కొరవడితే తీవ్ర అనారోగ్యాలు చుట్టుముడతాయని తేల్చిచెప్పాయి. చురుకైన జీవనశైలిని అలవరచుకోవడమే ఈ అనర్ధాలను తప్పించుకునేందుకు పరిష్కారంగా ముందుకొస్తోంది. ఇక అధిక బరువును తగ్గించుకుని చలాకీగా మారేందుకు రన్నింగ్, వేగంగా నడవడం, సైక్లింగ్, స్విమ్మింగ్, మెట్లు ఎక్కడం వంటి ఓ మోస్తరు నుంచి కఠిన వ్యాయామాలను క్రమం తప్పకుండా అనుసరించాలని చెబుతున్నారు.
ఇక తేలికపాటి శ్రమతో కూడిన కార్యకలాపాలు సైతం మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు కల్పిస్తుందని యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది. 30 నిమిషాల పాటు కూర్చోవడంతో పోలిస్తే 30 నిమిషాలు నిద్రించడం ద్వారా బరువు గణనీయంగా తగ్గుతారని ఈ అధ్యయనం వెల్లడించింది. నిలుచుని ఉండటం, కొద్దిపాటి నడక కూడా ఇదే తరహా ఫలితాలు అందిస్తుందని తెలిపింది.
నాణ్యతతో కూడిన నిద్ర, అది గుండె ఆరోగ్యంపై చూపే ప్రభావం కీలకమని డెన్వర్‌కు చెందిన నేషనల్ జ్యూయిష్ హెల్త్ డైరెక్టర్, ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ ఆండ్రూ ఫ్రీమన్ పేర్కొన్నారు. అయితే ఆరోగ్యాన్ని పెంపొందించే ఇతర పద్ధతులకు ప్రత్యామ్నాయంగా అదే పనిగా నిద్రిస్తే ప్రతికూల ఫలితాలు తప్పవని హెచ్చరించారు. తేలికపాటి నుంచి కఠిన వ్యాయామాలు బరువు తగ్గడంతో పాటు నడుము చుట్టుకొలతను తగ్గిస్తాయని కూడా ఈ అధ్యయనం వెల్లడించింది.
Read More :