Type-2 Diabetes | మధుమేహం.. దీన్నే చక్కెర వ్యాధి అని, షుగర్ వ్యాధి అని పిలుస్తారు. చాప కింది నీరులా మనలో చేరి మనకు తెలియకుండానే మనల్ని తీవ్ర అనారోగ్యానికి గురిచేస్తుంది. నియంత్రణ లేని ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటాబాలిజం కారణంగా ఈ వ్యాధి కనిపిస్తుంది. సాధారణంగా రక్తంలో గ్లూకోజ్ 100 మి.గ్రా /డె.లీ ఉండాలి. అంత కంటే ఎక్కువగా ఉంటే మధుమేహంగా భావించాలి.
మధుమేహం మనలో కనిపించిందంటే కొన్ని లక్షణాలు బయటపడుతుంటాయి. వీటి ఆధారంగా మనలో చక్కెర వ్యాధి పాగా వేసిందని భావించాల్సి ఉంటుంది. వీటిలో ముఖ్యంగా తరచూ మూత్రం రావడం, దాహం ఎక్కువగా వేయడం, అకారణంగా బరువు తగ్గిపోవడం, చూపు మందగించడం, అతిగా ఆకలి వేయడం, కాళ్లలో స్పర్శ కోల్పోవడం వంటి లక్షణాలతో కూడా మనలో షుగర్ వ్యాధి వచ్చేసిందని గుర్తుపట్టాలి. టైప్-2 డయాబెటిస్ తొలిదశలో గుర్తించడం కొంచెం కష్టం. అయితే, రక్త నాళాలు, మూత్రపిండాలు, గుండె సమస్యలు వచ్చిన తర్వాతే ఎక్కువ మంది గుర్తిస్తారు.
నిద్ర సంబంధ లక్షణం..
వర్క్ ప్రెజర్ లేదా ఇతర ఒత్తిళ్ల కారణంగా మనం తరచుగా రాత్రుల్లో మెలకువగా ఉంటుంటాం. ఇది చాలా సాధరణమైందని అనిపించినప్పటికీ అది డయాబెటీస్ ప్రారంభానికి సూచన కావొచ్చు. నిద్రపోవడంలో ఇబ్బంది డైప్-2 డయాబెటీస్ రిస్క్‌తో ముడిపడి ఉన్నదని యూనివర్శిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకుల బృందం కనుగొన్నది. దీర్ఘకాలిక నిద్ర సమస్యలు బలహీనమైన జీవక్రియలు, గుండె ఆరోగ్యానికి సూచకలు అని పరిశోధకులు గుర్తించారు. ఇది కొలెస్ట్రాల్, బాడీ మాస్ ఇండెక్స్, ఇన్ఫ్లమేటరీ మార్కర్లను తీవ్ర ప్రమాదం చేస్తుంది. ఇవన్నీ టైప్-2 డయాబెటీస్ ప్రమాద కారకాలే.
నిద్ర పట్టకపోవడంలో ఇబ్బంది అనేది.. నిద్రపోకపోవడం, నిద్ర మధ్యలో లేవడం లేదా ప్రశాంతంగా నిద్రపోకపోవడం వంటివి ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. 8 గంటలు నిద్రపోతూ మధ్యలో 4-5 సార్లు మేల్కొంటే అది కూడా డిస్టర్బ్డ్ స్లీప్ క్యాటగిరీ కిందికే వస్తుంది. నిద్ర పరిశుభ్రత, నిద్ర అలవాట్లు, మంచి నిద్ర, నిద్ర వ్యవధి.. ఇలా పలు అంశాలపై పరిశోధకులు విశ్లేషించారు. ఈ అంశాలన్నీ టైప్-2 డయాబెటీస్‌కు ఎలా దారి తీస్తాయా? అనే దానిపై అధ్యయనం జరిపారు. వీరు సగటున 45 సంవత్సరాల వయస్సున్న 1000 మంది వ్యక్తుల డాటాను తీసుకుని.. వారి నిద్ర వ్యవధి, నిద్ర సమయాలు, నిద్ర పోతున్నప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించారు.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర అవసరం. తగినంత నిద్ర లేనివారిలో గుండె ఆరోగ్యం, ఊపిరితిత్తుల ఆరోగ్యంతో పాటు పలు విధులకు ఆటంకం కలిగిస్తుంది. ఇలాంటి వారు మానసిక రుగ్మతలు, ఏకాగ్రత కోల్పోవడం, బలహీనమైన దృష్టి, అధిక రక్తపోటు, శ్వాస సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల, నిద్ర యొక్క వ్యవధిని మాత్రమే కాకుండా మొత్తంగా నిద్రను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రమాదాలను దూరం చేసుకోవాలన్నా.. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలన్నా మంచి నిద్ర ఉండాల్సిందే.