ఒక్కరాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోయినా.. మర్నాడు పొద్దున అసౌకర్యంగా అనిపిస్తుంది. చురుకుగా ఉండలేకపోతాం. నిద్రలేమి కారణంగా మెదడులో జరిగే ఇలాంటి మార్పులపై ‘జర్నల్ ఆఫ్ న్యూరో సైన్స్’లో ఓ అధ్యయనం ప్రచురితమైంది. జర్మనీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన జరిపారు. దాని ప్రకారం.. నిద్రలేమికి, అకాల వృద్ధాప్యానికి ప్రత్యక్ష సంబంధం ఉంది. ‘తీవ్రమైన నిద్రలేమి మెదడు స్వరూపాన్ని మార్చేస్తుంది. మెదడు వయసు పెరిగినట్లుగా అనిపిస్తుంది. అయితే ఇది శాశ్వతం కాదు.
మంచి నిద్రతో మునుపటి స్థితికి చేరుకోవచ్చు’ అంటారు జర్మనీలోని ఆర్డబ్ల్యూటీహెచ్ యూనివర్సిటీకి చెందిన ఇవా మేరియా ఎల్మన్హోర్ట్స్. అంతేకాదు, నిద్రలో ఆటంకాలు కూడా మెదడు వయసు పెరుగుదలతో సంబంధం కలిగి ఉంటాయట. పరిశోధకులు తమ అధ్యయనం కోసం 19 నుంచి 39 ఏండ్ల వయసు కలిగిన 134 మంది ఆరోగ్యవంతుల మ్యాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్ (ఎంఆర్ఐ) డాటాను పరిశీలించారు. ఈ క్రమంలో 24 గంటలకుపైగా నిద్రపోకుండా గడిపితే మెదడు వయసు ఒకటి రెండేండ్లు పైబడినట్లు కనుగొన్నారు. ఆ తర్వాత, ఒక రాత్రి మంచినిద్ర వల్ల మెదడు పూర్వపు స్థితికి చేరుకుందనీ గుర్తించారు. ఇక మూడు నాలుగు గంటల పాక్షిక నిద్రతో మెదడు వయోభారంలో పెద్ద మార్పులేమీ కనిపించలేదట. మెదడును యవ్వనంగా ఉంచుకోవడానికైనా సుఖనిద్రను ఆహ్వానిద్దాం. మెదడు హుషారుగా ఉంటేనే.. శరీరానికి చురుకుదనం.