మేడమ్! మా పిన్నికి ఒంటిమీద అక్కడక్కడా చిన్నచిన్న బొడిపెల్లాంటివి వస్తున్నాయి. దీంతో తను ఆత్మన్యూనతకు గురవుతున్నది. ఏవో చిట్కాలు ప్రయోగించింది కానీ, ఫలితం ఉండటం లేదు. ఈ సమస్యకు కాస్మటాలజీలో పరిష్కారం ఉందా?
వీటిని ఇంగ్లిష్లో ‘స్కిన్ ట్యాగ్స్’ అంటాం. ఒంటి మీద అదనపు చర్మం పెరుగుదల ఫలితమే ఈ వికృత ఆకృతులు. చంకలు, మెడ, ఛాతీ తదితర చోట్ల ఎక్కువగా వస్తుంటాయి. ఊబకాయం, మధుమేహం కూడా ఓ కారణమే. తొంభైశాతం సందర్భాల్లో వీటివల్ల ఎలాంటి హానీ జరుగదు. నొప్పి కూడా ఉండదు. అరుదుగా మాత్రం క్యాన్సర్ కణుతులుగా మారే ప్రమాదం ఉంది. సౌందర్య స్పృహ ఉన్నవారు చిన్నపాటి లోపాన్ని కూడా తట్టుకోలేరు.
దీంతో రకరకాల చిట్కాలు ప్రయత్నిస్తుంటారు. ఇవి పనిచేయవచ్చు, చేయకపోనూవచ్చు. చాలా సందర్భాల్లో స్కిన్ ట్యాగ్స్ మాయమైనా ఆ మచ్చలు మాత్రం మిగిలిపోతాయి. రకరకాల అలర్జీలకూ కారణం అవుతాయి. కాబట్టి, సాధ్యమైనంత వరకూ శాస్త్రీయమైన పద్ధతులనే ఎంచుకోవాలి. చిన్నపాటి శస్త్ర చికిత్స ద్వారా వీటిని సులభంగా తొలగించవచ్చు. కాబట్టి, భయపడాల్సిన పన్లేదు. ఆత్మన్యూనతకు గురికావాల్సిన అవసరమూ లేదు.