Skin Care In Winter | చలికాలంలో చాలా మందికి సహజంగానే చర్మం పగులుతుంది. కొందరికి చర్మం పగలడంతోపాటు దురదలు కూడా వస్తుంటాయి. చర్మంపై పొట్టు రాలి అంద విహీనంగా కూడా కనిపిస్తుంది. చర్మం కాంతిహీనంగా మారి డల్‌గా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే చలికాలంలో చర్మాన్ని రక్షించుకోవడం కష్టంగా మారుతుంది. అయితే చలికాలంలో చల్ల గాలి వల్ల చర్మంలో ఉండే తేమ బయటకు వెళ్తుంది. దీంతో చర్మం పొడిగా మారుతుంది. ఫలితంగా చర్మం పొట్టు రాలడం, దురదగా ఉండడం వంటివి సంభవిస్తాయి. అయితే చలికాలంలో ఆహారం విషయంలో అనేక మార్పులు చేసుకుంటే దాంతో చర్మాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఉండే ఆహారాలను తీసుకుంటే ఈ సీజన్లో చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాలను తీసుకుంటే చర్మం సురక్షితంగా ఉంటుంది. ఇవి శక్తివంతమైన యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను సైతం కలిగి ఉంటాయి. అందువల్ల చర్మంపై ఉండే ఎరుపుదనం, దురద వంటివి తగ్గిపోతాయి. చర్మ కణాలు సురక్షితంగా ఉంటాయి. చర్మంలో ఉండే తేమ బయటకు వెళ్లకుండా అడ్డుకోవచ్చు. దీంతో చర్మం పొడిబారకుండా తేమగా ఉంటుంది. కాంతివంతంగా మారి మెరుస్తుంది. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మనకు ఎక్కువగా చేపలు, వాల్ నట్స్, అవిసె గింజలు, చియా విత్తనాలు, అవకాడో, ఆలివ్ ఆయిల్, బాదంపప్పు, బ్రెజిల్ నట్స్, పొద్దు తిరుగుడు విత్తనాలు వంటి ఆహారాల్లో లభిస్తాయి. వీటిల్లో ఆరోగ్యకరమైన కొవ్వులతోపాటు విటమిన్ ఇ, జింక్ అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి చర్మాన్ని సురక్షితంగా ఉంచుతాయి.
నీటి శాతం అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను తీసుకుంటున్నా కూడా చర్మానికి మేలు జరుగుతుంది. ఇవి చర్మానికి కావల్సిన తేమను అందిస్తాయి. చర్మం పొడిబారకుండా చూస్తాయి. కీరదోస, కొత్తిమీర, పుచ్చకాయ, నారింజ పండ్లు వంటి ఆహారాలను తీసుకుంటే మేలు జరుగుతుంది. అలాగే చికెన్ లేదా వెజిటబుల్ సూప్‌లను తాగవచ్చు. ఇవి కూడా చర్మానికి కావల్సిన తేమను అందించి చర్మాన్ని పగలకుండా చూస్తాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలను తినడం వల్ల కూడా చర్మానికి సంరక్షణ లభిస్తుంది. వీటి వల్ల చర్మ కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. చర్మ కణాలు మరమ్మత్తులకు గురవుతాయి. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మం ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా క్యాప్సికం, బ్రోకలీ, కివి, పాలకూర, క్యారెట్లు, చిలగడదుంపలు, గుమ్మడికాయలు, పప్పు దినుసులు, శనగలు వంటి ఆహారాల్లో లభిస్తాయి. కనుక వీటిని తింటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
ప్రో బయోటిక్ ఆహారాలను ఈ సీజన్ లో రోజూ తీసుకుంటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. ఇవి చర్మ కణాలను రక్షిస్తాయి. చర్మం వాపులకు గురి కాకుండా చూస్తాయి. దీని వల్ల చర్మం పగలకుండా సురక్షితంగా ఉంటుంది. పెరుగు, మజ్జిగ, పాలు వంటివి ఈ కోవకు చెందుతాయి. కనుక ఈ ఆహారాలను ఈ సీజన్లో కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక చలికాలంలో చర్మం సురక్షితంగా ఉండాలంటే మద్యం అతిగా సేవించకూడదు. అలాగే టీ, కాఫీలను కూడా మరీ అతిగా తాగకూడదు. చక్కెర పానీయాలను తీసుకోవడం మానేయాలి. ప్రాసెస్ చేయబడిన ఆహారాలను ఎట్టి పరిస్థితిలోనూ తీసుకోకూడదు. ఈ విధంగా ఆహారం విషయంలో పలు జాగ్రత్తలను పాటిస్తే చలికాలంలో చర్మాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు. చర్మం పగలకుండా ఉంటుంది.