Seeds To Take To Reduce Cholesterol | గుండె జబ్బుల బారిన పడడానికి కారణమైన అంశాలలో అధిక కొలెస్ట్రాల్ కూడా ఒకటి. నూనెలో వేయించిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, శారీరక శ్రమ చేయకపోవడం, ధూమపానం, మద్యపానం వంటి వివిధ కారణాల వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా పేరుకుపోతూ ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్ కారణంగా గుండె జబ్బులతో పాటు శరీర బరువు కూడా పెరుగుతుంది. ఇతరత్రా అనారోగ్య సమస్యల బారిన కూడా పడాల్సి వస్తుంది. నేటి తరుణంలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. అయితే జీవన విధానంలో మార్పుతో పాటు మన ఆహారంలో కొన్ని రకాల గింజలను తీసుకోవడం వల్ల ఈ సమస్య నుండి చాలా సులభంగా బయట పడవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించే గింజల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక కొలెస్ట్రాల్ తో బాధపడే వారు అవిసె గింజలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అవిసె గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లతోపాటు లిగ్నన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి. అలాగే గుమ్మడి గింజలు కూడా అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో దోహదపడతాయి. వీటిలో మెగ్నీషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. ఇక అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వారు పొద్దుతిరుగుడు గింజలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటిలో ఫైటోస్టెరాల్స్ తో పాటు మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో నువ్వులు కూడా మనకు ఎంతో ఉపయోగపడతాయి. వీటిని తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా తయారవ్వడంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో చియా విత్తనాలు కూడా దోహదపడతాయి. వీటిలో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ ను తొలగించడంలో మనకు సహాయపడుతుంది. అలాగే అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వారు మెంతులను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటిలో ఫైబర్ తో పాటు సపోనిన్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే అవయవాల నుండి కొలెస్ట్రాల్ ను తొలగించడంలో దోహదపడతాయి.
కాలోంజి విత్తనాలు కూడా అధిక కొలెస్ట్రాల్ సమస్య నుండి బయటపడడంలో తోడ్పడతాయి. వీటిలో యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. వీటిని తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే జనపనార విత్తనాలను తీసుకోవడం వల్ల కూడా కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.