Health Study | ప్రపంచవ్యాప్తంగా ఊబకాయంతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. రాబోయే 25 ఏళ్లలో ఈ సంఖ్య విపరీతంగా పెరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2050 నాటికి ప్రపంచంలో మూడింట ఒకవంతు మంది పిల్లలు, యుక్తవయస్కులు ఊబకాయం, అధిక బరువుతో బాధపడే అవకాశం ఉందని పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ఆస్ట్రేలియాకు చెందిన ముర్డోక్ చిల్డ్రన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో జగింది. ఈ అధ్యయనం ఫలితాలపై పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న ఈ సమస్య ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు పిల్లలు, యుక్త వయస్కుల లైఫ్ క్వాలిటీపై ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు.
అధ్యయనం రచయిత్రి డాక్టర్ జెస్సికా కెర్ మాట్లాడుతూ.. పెరుగుతున్న ఈ సమస్య ఆరోగ్య వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థపై బిలియన్ డాలర్ల భారాన్ని మోపుతుందని పేర్కొన్నారు. దాంతో పాటు మధుమేహం, క్యాన్సర్, గుండె సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, సంతాన సమస్యలు, మానసిక ఆరోగ్య సమస్యల బారినపడే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం, భవిష్యత్లో పిల్లలు, కౌమారదశను ప్రభావితం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. 1990 నుండి 2021 వరకు 5 నుంచి 24 సంవత్సరాల వయస్సు గల పిల్లలు, కౌమారదశలో ఉన్నవారిలో ఊబకాయం రేటు మూడు రెట్లు పెరిగిందని పరిశోధనలో తేలింది. 2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా 493 మిలియన్ల మంది పిల్లలు, కౌమారదశలో ఉన్నవారంతా ఊబకాయం లేదంటే అధిక బరువు ఉన్నవారు ఉన్నారు.
ఊబకాయంన్న పిల్లలకు స్ట్రోక్, అనేక రకాల క్యాన్సర్, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, అకాల మరణంతో పాటు జీవితంలో మానసిక ఆరోగ్య సమస్యల బారినపడే ప్రమాదం ఉంది. ఈ సమస్యపై తక్షణం చర్యలు తీసుకోకపోతే భవిష్యత్లో భావితరాల జీవితం కష్టతరంగా మారవచ్చని డాక్టర్ కెర్ పేర్కొన్నారు. 2030కి ముందు అవసరమైన చర్యలు తీసుకోవాలని.. ఫలితంగా సమస్యను పరిష్కారమవుతుందని అంచనా వేశారు.