పెద్ద దెబ్బలు, కాలిన గాయాలు చర్మాన్ని బాగా ఇబ్బంది పెడతాయి. ఆయా గాయాలు మానినా దానిపైన ఉండే చర్మం మాత్రం సాధారణంగా ఏర్పడదు. ముడుచుకుపోయినట్టుగా ఒక పెద్ద మచ్చలాగా స్థిరపడిపోతుంది. చిన్న చిన్న గాయాల విషయంలో ఫర్వాలేదు కానీ ఏవైనా ప్రమాదాల వల్ల పెద్ద దెబ్బలు తగిలినప్పుడు ఆ ప్రాంతమంతా ఇలా ముడతలుగా చర్మం ఏర్పడటం అన్నది ఇబ్బందికరమైన విషయమే. ఇలాంటి సందర్భాల్లో ఆయా ప్రదేశాల్లో సాధారణ చర్మం ఏర్పడేందుకు ఉపయోగపడేలా ఇటీవల స్వీడన్ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన జెల్‌ను రూపొందించారు. దీన్నే ‘స్కిన్ ఇన్ ఎ సిరంజ్ ’ అని పిలుస్తున్నారు.
డెర్మిస్గా పిలిచే చర్మపు రెండో పొరను సాధారణ రీతిలో తిరిగి ఏర్పడేలా ప్రోత్సహించడం దీని పని. అందుకోసం ఆ పొరలో ఉండే ఫైబ్రోబ్లాస్ట్ కణజాలంతో పాటు హ్యాలురానిక్ యాసిడ్ జెల్, జెలాటిన్ బీడ్స్లను కలిపి ఒక ప్రత్యేకమైన జెల్‌ను తయారు చేశారు. ఇది గాయమైన చోట చర్మం పైన పూతలా పూసేందుకు, లేదా త్రీడీ పద్ధతిలో చర్మాన్ని గ్రాఫ్టింగ్ చేసేందుకు ఉపయోగపడుతుంది. డెర్మిస్గా పిలిచే ఈ పొరలోనే రక్తనాళాలు, కనెక్టింగ్ టిష్యూ, కొలాజెన్, ఎలాస్టిక్ ఫైబర్లలాంటివి ఉంటాయి.
క్లిష్టమైన ఈ పొరను ట్రాన్స్‌ప్లాంట్ చేయడం కష్టతరం. కనుక శరీరం దానికదే డెర్మిస్‌ను తయారు చేసుకునేందుకు సహకరించేలా, సిరంజి ద్వారా గాయం మీద రాయగలిగే ఈ జెల్‌ను రూపొందించారు. స్వీడన్‌లోని సెంటర్ ఫర్ డిజాస్టర్ మెడిసిన్ అండ్ ట్రమటాలజీ, లింకోపింగ్ యూనివర్సిటీలు సంయుక్తంగా ఎలుకల మీద విజయవంతంగా చేసిన ఈ ప్రయోగం మునుముందు చర్మ చికిత్సల మీద కొత్త ఆశలను రేకెత్తిస్తున్నది.