Alzheimer’s | కరోనా మహమ్మారి రెండున్నరేళ్లకు పైగా ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. మహమ్మారి వివిధ రకాల తీవ్రమైన ఆరోగ్య సమస్యలను పెంచుతుంది. కరోనా సోకిన వ్యక్తుల్లో లాంగ్ కొవిడ్ పెద్ద ముప్పుగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న తర్వాత కూడా చాలాకాలం పాటు కొన్ని లక్షణాలు కనిపిస్తాయని పేర్కొంటున్నారు. అయితే, ఇటీవలి అధ్యయనంలో కరోనా.. అల్జీమర్స్ వంటి తీవ్రమైన నాడీ సంబంధిత రుగ్మతలను గణనీయంగా పెంచుతుందని పరిశోధకులు గుర్తించారు. కరోనా ఇన్ఫెక్షన్ అనంతరం 60 లేదా.. అంతకంటే ఎక్కువ వయస్సున్న వ్యక్తులు అల్జీమర్స్ ముప్పును గణనీయంగా పెంచుతుందని పరిశోధకులు గుర్తించారు. అధ్యయనంలో భాగంగా పరిశోధకుల బృందం.. 62 లక్షల కంటే ఎక్కువ మంది సీనియర్ సిటిజన్ల హెల్త్ రిపోర్ట్స్‌ను విశ్లేషించారు. కరోనా సోకి.. కోలుకున్న తర్వాత సంవత్సరంలోపు చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం 50 నుంచి 80శాతం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని.. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులు ముందుజాగ్రత్తగా తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
అల్జీమర్స్ వ్యాధి మెదడు రుగ్మత. ఇది క్రమంగా జ్ఞాపకశక్తిని, ఆలోచనా సామర్థ్యాన్ని నాశనం చేస్తుంది. తీవ్రమైన పరిస్థితుల్లో కొంత సమయం తర్వాత సాధారణ ఇంటి పనులను కూడా చేయడం కష్టంగా మారుతుంది. కరోనా సోకిన వారిలో అల్జీమర్స్ వచ్చే ప్రమాదం ఇతర వ్యక్తుల కంటే ఎక్కువగా ఉండవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నప్పటికీ.. 65 ఏళ్ల తర్వాత నరాల వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంది. కరోనా వైరస్ మెదడులో మంటను కలిగిస్తుందని, ఇది అల్జీమర్స్ ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21న అల్జీమర్స్‌పై అవగాహన కల్పించేందుకు ప్రపంచ అల్జీమర్స్ డే జరుపుతున్నారు.
జర్నల్ ఆఫ్ అల్జీమర్స్ డిసీజ్‌లో అధ్యయనం ప్రచురితమైంది. శాస్త్రవేత్తల బృందం ఫిబ్రవరి 2020 – మే 2021 మధ్య కరోనా సోకిన వ్యక్తుల డేటాపై అధ్యయనం చేసింది. అల్జీమర్స్ ప్రమాదాన్ని తెలుసుకోవడానికి పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా అల్జీమర్స్ ప్రమాదాన్ని పెంచుతుందని గుర్తించారు. అయితే, వృద్ధ మహిళల్లో ముప్పు ఎక్కువ ఉంటుందని పేర్కొన్నారు. అధిక రక్తపోటు, గుండె జబ్బులు, స్థూలకాయం సైతం అల్జీమర్స్‌ను పెంచుతాయని, ఇప్పటికే వాటితో బాధపడుతుంటే మరిన్ని సమస్యల బారినపడే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు.
కరోనా ఇన్ఫెక్షన్ వల్ల కలిగే సంభావ్య ప్రమాదాల గురించి మనం మరింత తీవ్రంగా, వివరంగా అర్థం చేసుకోవాలని అధ్యయన సహ రచయిత పమేలా డేవిస్ పేర్కొన్నారు. అయితే, కొవిడ్ నేరుగా అల్జీమర్స్‌ను ముప్పును అభివృద్ధిని చేస్తుందా? అనేది ఇంకా నిర్ణయించలేదు. ఏదేమైనా, సంక్రమణ మెదడు కణాల్లో వాపుతో సమస్యలను కలిగించే విధానాన్ని బట్టి, కరోనా సంక్రమణ అల్జీమర్స్ వ్యాధితో పాటు అనేక ఇతర నాడీ సంబంధిత రుగ్మతల ప్రమాదాన్ని పెంచుతుంది. దీని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
కొవిడ్ ఇన్ఫెక్షన్ తర్వాత పూర్తిగా కోలుకోలేకపోతున్నారని భావిస్తే, తప్పకుండా నిపుణులను సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీర్ఘకాల కొవిడ్ సమస్య అనేక ఇతర సమస్యలకు కారణం కావచ్చని పేర్కొంటున్నారు. మరోవైపు, గతంలో అల్జీమర్స్, మరే ఇతర నాడీ సంబంధిత రుగ్మతలు ఉన్నా.. ఆ కుటుంబంలోని వ్యక్తులంతా తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అల్జీమర్స్ వంటి న్యూరోలాజికల్ డిజార్డర్స్ 60 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో పెరుగుతున్నాయని కొన్ని నివేదికలో తేలింది. అలాంటి పరిస్థితుల్లో , కరోనా ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న తర్వాత ముందుజాగ్రత్తగా వైద్యుల సలహా మేరకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.