Rice And Weight Loss | అధిక బరువు సమస్య ప్రస్తుతం చాలా మందిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. అధికంగా ఉన్న బరువు కారణంగా అనేక మంది తీవ్ర అవస్థలు పడుతున్నారు. బరువు పెరిగేందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. వేళకు భోజనం చేయకపోవడం, రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేయడం, ఆలస్యంగా నిద్రించడం, బయటి ఫుడ్ లేదా జంక్ ఫడ్ను అధికంగా తినడం, మద్యం అధికంగా సేవించడం వంటి అనేక కారణాల వల్ల చాలా మంది అధికంగా బరువు పెరుగుతున్నారు. అయితే బరువు తగ్గేందుకు చాలా మంది అనేక రకాల డైట్లను పాటిస్తుంటారు. ఈ క్రమంలోనే అన్నం తినడం కూడా పూర్తిగా మానేస్తారు. లేదంటే బరువు తగ్గమేమోనని ఆందోళన చెందుతారు. అన్నంకు బదులుగా చపాతీలు, ఇతర ఆహారాలను తినేందుకు ప్రయత్నిస్తారు. అయితే అధిక బరువు తగ్గాలంటే కచ్చితంగా అన్నం తినడం మానేయాలా..? అన్నం తింటూ కూడా బరువును తగ్గించుకోలేమా..? అంటే ఇందుకు పోషకాహార నిపుణులు సమాధానాలు చెబుతున్నారు.
అధిక బరువును తగ్గించుకోవాలంటే డైట్ పాటించాలి. కానీ అన్నం తినడం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. అన్నం తింటూ కూడా బరువును తగ్గించుకోవచ్చు.. అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనే నెపంతో కొందరు అన్నం తినడం పూర్తిగా మానేస్తారు. కానీ అలా చేయాల్సిన పనిలేదని అంటున్నారు. అన్నాన్ని రోజూ కొద్ది కొద్దిగా తినవచ్చని సూచిస్తున్నారు. అన్నం అంటే పూర్తిగా పాలిష్ చేయబడిన బియ్యంతో వండేది. ఇందులో పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. అవి మన శరీరంలో అధికంగా చేరితే కొవ్వు కింద మారుతాయి. దీంతో బరువు పెరుగుతారు. అయితే ఇలా జరిగే మాట వాస్తవమే. కానీ అంత మాత్రాన అన్నం తినడాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. రోజూ మనకు పిండి పదార్థాలు కూడా అవసరం అవుతాయి. కనుక మనకు కావల్సినంత మోతాదులో అన్నాన్ని కూడా తినాల్సి ఉంటుంది.
సాధారణంగా చాలా మందికి రోజూ 70 నుంచి 100 గ్రాముల మేర పిండి పదార్థాలు అవసరం అవుతుంటాయి. కనుక అన్నాన్ని పూర్తిగా మానేయాల్సిన పనిలేదు. అయితే ఈ పిండి పదార్థాలు లభించాలంటే అన్నాన్ని ఒక్కసారి ఒక కప్పు మోతాదులో మాత్రమే తినాలి. అంతకు మించి తినకూడదు. ఒక కప్పు అన్నం తింటే సుమారుగా 40 గ్రాముల పిండి పదార్థాలు లభిస్తాయి. కనుక పూటకు ఒక కప్పు అన్నం అయితే మధ్యాహ్నం, రాత్రి రెండు పూటలూ కలిపి మొత్తం రెండు కప్పుల అన్నం తినవచ్చు. దీంతో 80 గ్రాముల పిండి పదార్థాలు లభిస్తాయి. ఇవి మనకు రోజుకు సరిపోతాయి. ఇలా అన్నాన్ని తినాల్సి ఉంటుంది. దీని వల్ల బరువు తగ్గడం కూడా తేలికవుతుంది.
అయితే చాలా మంది అన్నాన్ని మరీ అతిగా తింటారు. అలాంటి వారికి ఎంత తింటున్నాం అనే విషయంపై నియంత్రణ ఉండదు. కనుక వారు ఎట్టి పరిస్థితిలోనూ ఒక కప్పు వరకు మాత్రమే అన్నాన్ని తినలేరు. కనుక అలాంటి వారు అన్నం తినడాన్ని పూర్తిగా మానేయడమే మంచిది. లేదంటే తక్కువ మోతాదులో తినడం వారికి సాధ్యం కాక అన్నాన్ని ఎక్కువగా తింటారు. దీంతో బరువు తగ్గాలనుకునే వారి ప్రణాళిక నెరవేరదు. అయితే మరి అన్నం తినకపోతే ఎలా.. అంటే అందుకు ప్రత్యామ్నాయంగా పుల్కాలను తినవచ్చు. ఒక పుల్కాను తింటే కేవలం 15 గ్రాముల పిండి పదార్థాలు మాత్రమే లభిస్తాయి. దీంతో పిండి పదార్థాలపై నియంత్రణ ఉంటుంది. లేదా బ్రౌన్ రైస్‌ను అయినా సరే ఆహారంలో భాగం చేసుకోవచ్చు. దీంతోనూ తక్కువ మోతాదులో పిండి పదార్థాలు, అధికంగా ఫైబర్ లభిస్తాయి. ఫైబర్ వల్ల బ్రౌన్ రైస్‌ను కాస్త తిన్నా సరిపోతుంది. పైగా బరువు తగ్గేందుకు ఇది సహాయం చేస్తుంది. ఇలా అన్నం తినడంపై అవగాహన ఉంటే బరువు తగ్గడం చాలా తేలికవుతుంది.