Rajma | రాజ్మా.. వీటినే కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు. చూసేందుకు అచ్చం ఇవి కిడ్నీల మాదిరిగానే ఉంటాయి. కనుకనే ఈ బీన్స్‌ను ఆ పేరుతో పిలుస్తారు. రాజ్మాను ఎక్కువగా ఉత్తరాదికి చెందిన వారు తింటారు. రాజ్మాతో కూర చేసి దాన్ని చపాతీలతో తింటారు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అయితే రాజ్మాను పోషకాలకు గనిగా చెప్పవచ్చు. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రాజ్మాను తింటే అనేక పోషకాలు లభిస్తాయి. వెజిటేరియన్లకు రాజ్మాను చక్కని ఆహారంగా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రోటీన్లు రాజ్మాలో అధికంగా ఉంటాయి. 100 గ్రాముల రాజ్మాను ఉడకబెట్టి తింటే సుమారుగా 24 గ్రాముల వరకు ప్రోటీన్లను పొందవచ్చు. ప్రోటీన్లు శరీరానికి శక్తిని అందించడమే కాకుండా కండరాలు నిర్మాణం అయ్యేలా చేస్తాయి. కనుక శాకాహార ప్రియులు మాంసానికి ప్రత్యామ్నాయంగా రాజ్మాను తినవచ్చు. ఇవి మాంసం లాంటి ప్రయోజనాలను అందిస్తాయి.
రాజ్మాలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఫైబర్ వల్ల పేగుల్లో మలం కదలికలు సరిగ్గా ఉంటాయి. దీంతో మలబద్దకం తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీంతో కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీని వల్ల ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. బరువు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. 100 గ్రాముల రాజ్మాను తినడం వల్ల సుమారుగా 25 గ్రాముల మేర ఫైబర్ లభిస్తుంది. రాజ్మా గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) విలువ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందువ్లల రాజ్మాను తింటే షుగర్ లెవల్స్ అమాంతం పెరగవు. పైగా రాజ్మాలో ఉండే ఫైబర్ షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారికి రాజ్మా ఎంతగానో సహాయం చేస్తుంది.
రాజ్మా గింజల్లో పొటాషియం, ఫైబర్, మెగ్నిషియం అధికంగా ఉండడం వల్ల ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఫైబర్ వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. పొటాషియం కారణంగా రక్త సరఫరా మెరుగు పడి బీపీ తగ్గుతుంది. అలాగే రాజ్మాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో గుండె జబ్బులు రాకుండా నివారించవచ్చు. రాజ్మాలో ఉండే క్యాల్షియం, మెగ్నిషియం, ఫాస్ఫరస్ ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. రాజ్మాలో మాంగనీస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తికి దోహదం చేస్తుంది. దీంతో రక్తం తయారవుతుంది. రక్తహీనత తగ్గుతుంది. రాజ్మాలో ఉండే జింక్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది.
రాజ్మాలో ఫోలేట్ (విటమిన్ బి9) అధికంగా ఉంటుంది. ఇది కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖ్యంగా గర్భిణీలు రాజ్మాను తింటే ఎంతో మేలు జరుగుతుంది. గర్భంలో ఉన్న శిశువుకు ఈ విటమిన్ లభించి వారిలో పుట్టుక లోపాలు రాకుండా ఉంటాయి. గర్భస్థ శిశువు ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. రాజ్మాలో ఫ్లేవనాయిడ్స్, ఆంథో సయనిన్స్ అనేక వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి. దీంతో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. ఇలా రాజ్మా గింజలను తరచూ తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. అయితే వీటిని కూరగా వండే ముందు కనీసం 12 గంటల పాటు నానబెట్టాలి. అప్పుడే ఇవి సరిగ్గా ఉడుకుతాయి. వాటిల్లో ఉండే పోషకాలను మన శరీరం సరిగ్గా శోషించుకుంటుంది.