Raisins And Dates | మన శరీరానికి అవసరమయ్యే పోషకాల్లో ఐరన్ కూడా ఒకటి. ఎర్ర రక్తకణాల తయారీలో, రక్తాన్నిఆరోగ్యంగా ఉంచడంలో, ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ ను శరీరం మొత్తానికి అందించడంలో, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో, మెదడు అభివృద్దికి, శక్తిని పెంపొందించడంలో ఐరన్ మనకు సహాయపడుతుంది. ఐరన్ మన శరీరానికి చాలా అవసరం. శరీరంలో ఐరన్ లోపించడం వల్ల మనం వివిధ అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఉంటాయి. నీరసం, అలసట, చర్మం పొడిబారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం, తలతిరగడం, జుట్టు పొడిబారడం, జుట్టు రాలడం, గోర్లు పెళుసుగా మారడం వంటి లక్షణాలను బట్టి మన శరీరంలో ఐరన్ లోపించిందని గ్రహించాలి. తృణధాన్యాలు, పాలకూర, చేపలు, తోటకూర వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సిన ఐరన్ లభిస్తుంది. కానీ చాలా మంది ఎండుద్రాక్ష, ఖర్జూరాలను తీసుకోవడం వల్ల మాత్రమే శరీరంలో ఐరన్ స్థాయిలు పెరుగుతాయని భావిస్తారు.
అయితే ఎండుద్రాక్ష, ఖర్జూరాలు నిజంగా ఐరన్ స్థాయిలను పెంచుతాయా.. ఐరన్ పెరుగుదలకు వీటిని తీసుకోవడం ఎంత వరకు అవసరం.. దీని గురించి పోషకాహార నిపుణులు ఏమంటున్నారు.. అన్న వివరాలను ఇప్పుడు చూద్దాం. శరీరంలో ఐరన్ పెరుగుదలకు ఖర్జూరాలు, ఎండుద్రాక్షలపై మాత్రమే ఆధారపడకూడదని నిపుణులు చెబుతున్నారు. 100 గ్రాముల ఖర్జూరాల్లో 0.89 మిల్లీగ్రాములు, 100గ్రాముల ఎండుద్రాక్షలో 4.26 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. అయితే ఒక స్త్రీకి రోజుకి 29 మిల్లీగ్రాముల ఐరన్ అవసరమవుతుంది. కనుక ఇవి రెండు కూడా మన శరీరానికి కావల్సిన రోజువారీ ఐరన్ అవసరాలను తీర్చలేవు. అంతేకాకుండా వీటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి క్యాలరీలు ఎక్కువగా అందుతాయి. ఇవి రెండు కూడా చాలా తియ్యగా ఉంటాయి. షుగర్ వ్యాధిగ్రస్తులు వీటిని తీసుకోవడం వల్ల వారి రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. కనుక ఐరన్ లోపంతో బాధపడే వారు ఎండుద్రాక్ష, ఖర్జూరాలతో పాటు ఐరన్ కలిగిన ఇతర ఆహారాలను తీసుకోవడం కూడా చాలా అవసరం.
శరీరానికి కావల్సిన ఐరన్ కోసం వీటిపై పూర్తిగా ఆధారపడకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. పాలకూర, తోటకూర వంటి ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే రాజ్మా, నువ్వులు, బఠాణీ వంటి ఆహారాల్లో కూడా ఐరన్ ఉంటుంది. సోయాబీన్స్, అమరాంత్ (తోటకూర గింజలు) వంటి వాటిని తీసుకోవడం వల్ల కూడా తగినంత ఐరన్ ను పొందవచ్చు.
రొయ్యలు, చేపలు వంటి సముద్రపు ఆహారాన్ని తీసుకోవడం వల్ల, గుడ్లు, మాంసం వంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల కూడా మనం ఐరన్ ను పొందవచ్చు. కనుక ఐరన్ లోపాన్ని అధిగమించాలి అనుకునే వారు అలాగే ఐరన్ స్థాయిలను పెంచుకోవాలి అనుకునే వారు ఎండుద్రాక్ష, ఖర్జూరాలను మాత్రమే కాకుండా ఐరన్ కలిగిన ఇతర ఆహారాలను తీసుకోవడం కూడా చాలా అవసరమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.