Radish | రోజూ ఎవరైనా కానీ ఇష్టమైన ఆహారాలను తినేందుకే చూస్తుంటారు. ఇష్టం లేని ఆహారాలను అసలు ముట్టుకోరు. ఇంట్లో ఏదైనా ఇష్టం లేని కూర చేస్తే ముద్ద కూడా ముట్టరు. అయితే ఇలా చాలా మందికి రకరకాల ఆహారాలు అంటే ఇష్టం ఉండదు. అలాంటి ఆహారాల్లో ముల్లంగి కూడా ఒకటి. ఇది ఘాటైన వాసన, రుచిని కలిగి ఉంటుంది. కనుక చాలా మంది దీన్ని తినేందుకు అయిష్టతను ప్రదర్శిస్తుంటారు. ముల్లంగితో చాలా మంది కూర లేదా పచ్చడి చేస్తుంటారు. దీన్ని ముక్కలుగా కట్ చేసి సాంబార్ వంటి వాటిలోనూ వేస్తుంటారు. అయితే వాస్తవానికి ముల్లంగి మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ క్రమంలోనే రోజుకు 1 ముల్లంగిని తింటే అనేక లాభాలను పొందవచ్చు.
ముల్లంగి మనకు చలికాలంలో ఎక్కువగా లభిస్తుంది. ఇది సీజన్లో ఎక్కువగా వస్తుంది కానీ ఏడాది పొడవునా మనకు అందుబాటులో ఉంటుంది. అందువల్ల ముల్లంగిని రోజూ తినడంలో ఎలాంటి ఇబ్బంది ఎదురు కాదనే చెప్పాలి. ఇక ముల్లంగిని సలాడ్స్, పరాఠాలు, చట్నీల్లో తినవచ్చు. ఇందులో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా ముల్లంగిని తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. కనుక రోజుకు ఒక ముల్లంగిని ఆహారంలో భాగం చేసుకోవాల్సి ఉంటుంది.
ముల్లంగిలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. ఫైబర్ వల్ల సుఖ విరేచనం అవుతుంది. దీంతో మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు. ముల్లంగిని తినడం వల్ల పైత్య రసం ఉత్పత్తి అవుతుంది. దీంతో లివర్ పనితీరు మెరుగు పడుతుంది. ఫలితంగా పిత్తాశయం సక్రమంగా పనిచేస్తుంది. అందులో రాళ్లు ఏర్పడకుండా చూసుకోవచ్చు. ముల్లంగిలో సహజసిద్ధమైన క్లీనింగ్ గుణాలు ఉంటాయి. అందువల్ల లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. దీంట్లో సల్ఫర్ ఆధారిత సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. కనుకనే ముల్లంగి ఘాటు ఎక్కువగా ఉంటుంది.
అయితే ఘాటు ఉన్నా కూడా ముల్లంగిని రోజూ ఏదో ఒక విధంగా తింటుండాలి. దీంతో శరీరంలోని విష, వ్యర్థ పదార్థాలు, లివర్‌లోని టాక్సిన్లు బయటకు పోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది. దీని వల్ల అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు. ముల్లంగిలో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. ముల్లంగిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ను బయటకు పంపించడంలో సహాయ పడతాయి. దీంతో ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ముఖ్యంగా సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు, ఫ్లూ నుంచి రక్షణ లభిస్తుంది.
ముల్లంగిలో క్యాలరీలు తక్కువగా నీటి శాతం ఎక్కువగా ఉటుంది. అందువల్ల వీటిని తింటే బరువు తగ్గాలనుకునే వారికి ఎంతగానో మేలు జరుగుతుంది. ముల్లంగిని తినడం వల్ల ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఫలితంగా ఇది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. ఇలా ముల్లంగిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. కనుక ఈ సీజన్లో దీన్ని విడిచిపెట్టకుండా, మరిచిపోకండి తినండి. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.