Proteins Deficiency | మన శరీరానికి రోజూ అవసరం అయ్యే పోషకాల్లో ప్రోటీన్లు కూడా ఒకటి. ప్రోటీన్లు మనకు పెద్ద ఎత్తున అవసరం అవుతాయి. ప్రతి ఒక్కరు రోజూ కచ్చితంగా తమ శరీర బరువుకు అనుగుణంగా ప్రోటీన్లను తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక కిలో శరీర బరువుకు గాను 0.75 గ్రాముల ప్రోటీన్లను మనం తీసుకోవాలి. అప్పుడే శరీరానికి శక్తి లభిస్తుంది. కండరాలు మరమ్మత్తులకు గురై ఆరోగ్యంగా ఉంటాము. దేహం దృఢంగా మారుతుంది. రోజంతా శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న గణాంకాల ప్రకారం ప్రస్తుతం చాలా మంది ప్రోటీన్లు ఉండే ఆహారాలను సరిగ్గా తీసుకోవడం లేదని తేలింది. అందరూ జంక్ ఫుడ్‌కు అలవాటు పడ్డారు. దీని కారణంగా చాలా మందికి ప్రోటీన్ల లోపం కూడా వస్తుందని హెచ్చరిస్తున్నారు.
ప్రోటీన్ల లోపం ఉంటే మన శరీరం మనకు పలు లక్షణాలను, సంకేతాలను తెలియజేస్తుంది. ప్రోటీన్ల లోపం ఉన్నవారు ఎల్లప్పుడూ నీరసంగా ఉంటారు. బలహీనంగా అనిపిస్తారు. అలసట ఎక్కువగా ఉంటుంది. చిన్న పనిచేసినా విపరీతమైన అలసట వస్తుంది. అలాగే కండరాల నొప్పులు కూడా ఉంటాయి. బద్దకంగా ఉంటారు. ఏ పని చేయాలనిపించదు. ఇక బరువు తగ్గడం కోసం ఎన్ని వ్యాయామాలు చేసినా డైట్‌ను పాటించినా బరువు తగ్గలేకపోతుంటారు. ప్రోటీన్ల లోపం వల్ల కూడా ఇలా జరుగుతుంది. ఈ లోపం ఉంటే మెదడుపై కూడా ప్రభావం పడుతుంది. దీని వల్ల మూడ్ మారుతుంది. ఎల్లప్పుడూ ఏదో కోల్పోయినట్లు ఉంటారు. ఒత్తిడి, ఆందోళన అధికంగా ఉంటాయి.
ప్రోటీన్ల లోపం ఉన్నవారికి లో షుగర్ సమస్య ఏర్పడుతుంది. శరీరంలో షుగర్ లెవల్స్ ఎల్లప్పుడూ పడిపోతుంటాయి. దీంతో నీరసం వచ్చి స్పృహ తప్పినట్లు అనిపిస్తుంది. ప్రోటీన్ల లోపం ఉంటే ఎముకలకు క్యాల్షియం, విటమిన్ డి సైతం సరిగ్గా లభించవు. దీంతో అవి నొప్పులుగా ఉంటాయి. ఎల్లప్పుడూ ఎముకల నొప్పి ఉంటుంది. ఎముకలు బలహీనంగా కూడా మారుతాయి. చిన్న దెబ్బ తగిలినా ఎముకలు విరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్ల లోపం ఉంటే చర్మం ఎల్లప్పుడూ కందిపోయి ఎర్రగా కనిపిస్తుంది. కొందరికి చర్మంపై పొట్టు రాలుతుంది. పొలుసులుగా ఏర్పడి చర్మం ఊడిపోతుంది. అలాగే జుట్టు బాగా రాలిపోతుంది. వెంట్రుకలు పలుచబడతాయి. అలాగే గోర్లు బలహీనంగా మారుతాయి. అందవిహీనంగా కనిపిస్తాయి. గోర్లు చిట్లిపోతాయి. ఇలా ప్రోటీన్ల లోపాన్ని మనం సులభంగా గుర్తించవచ్చు.
ఇక ఈ లక్షణాలు ఉన్నవారు రోజూ ప్రోటీన్లు ఉండే ఆహారాలను తింటుంటే ఈ లోపం నుంచి బయట పడవచ్చు. దీంతో ఆయా అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఇక ప్రోటీన్లు మనకు ఎక్కువగా పప్పు దినుసులు, బీన్స్, శనగలు, బాదంపప్పు, జీడిపప్పు, వాల్ నట్స్, పిస్తా, గుమ్మడి విత్తనాలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, చియా సీడ్స్, అవిసె గింజలు, పచ్చి బఠానీలు, కాలిఫ్లవర్, క్యాబేజీ, చికెన్, మటన్, మటన్ లివర్, చేపలు, గుడ్లు, పాల వంటి ఆహారాల్లో లభిస్తాయి. కనుక వీటిని రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే కావల్సినన్ని ప్రోటీన్లు లభిస్తాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగాలు రాకుండా చూస్తాయి.