Protein Rich Nuts | మన శరీరం ఆరోగ్యంగా ఉండాంటే అందుకు అనేక పోషకాలు అవసరం అవుతాయన్న సంగతి తెలిసిందే. అయితే పోషకాల్లో రెండు రకాలు ఉంటాయి. స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు. కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు అని వీటిని స్థూల పోషకాలు అంటారు. ఇవి మనకు ఎక్కువ మొత్తంలో రోజూ అవసరం అవుతాయి. విటమిన్లు, మినరల్స్, ఇతర పోషకాలను సూక్ష్మ పోషకాలు అంటారు. వీటిని రోజూ తీసుకోవాల్సిన పనిలేదు. కానీ ఇవి మన శరీరానికి అవసరమే. ఇవి చాలా తక్కువ మొత్తంలో అవసరం అవుతాయి. అయితే చాలా మంది రోజూ పిండి పదార్థాలను ఎక్కువగా తింటుంటారు. దీంతో బరువు పెరుగుతారు. కానీ పిండి పదార్థాలతోపాటు ప్రోటీన్లను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రోటీన్లు మన శరీరానికి అనేక విధాలుగా పనిచేస్తాయి.
ప్రోటీన్లు మన శరీరంలో కండరాలను నిర్మాణం చేస్తాయి. ఎముకలను ఆరోగ్యంగా ఉంచి దృఢంగా మారుస్తాయి. మనకు ప్రోటీన్లు శక్తిని కూడా అందించి అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అయితే ప్రోటీన్లను సరిగ్గా తీసుకోవడం లేదని బాధపడుతున్నవారు పలు రకాల డ్రై ఫ్రూట్స్‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే చాలు. దాంతో ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. ప్రోటీన్లు మనకు మాంసాహారంలోనే కాదు, పలు డ్రై ఫ్రూట్స్‌లోనూ లభిస్తాయి. 100 గ్రాముల మేర బాదంపప్పు ద్వారా సుమారుగా 21 గ్రాముల మేర ప్రోటీన్లను పొందవచ్చు. బాదంపప్పులో మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఫైబర్ కూడా సమృద్ధిగానే లభిస్తుంది. బాదంపప్పును తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది అధిక బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. అలాగే బాదం పప్పును తింటే విటమిన్ ఇ ని పొందవచ్చు. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
వాల్ నట్స్‌లోనూ ప్రోటీన్లు సమృద్ధిగానే ఉంటాయి. 100 గ్రాముల వాల్ నట్స్‌ను తింటే సుమారుగా 15 గ్రాముల మేర ప్రోటీన్లు లభిస్తాయి. ఈ నట్స్‌లో ఆల్ఫా లినోలియిక్ యాసిడ్ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కనుక వాల్ నట్స్‌ను రోజూ గుప్పెడు తింటుంటే పోషకాలను సమృద్ధిగా పొందవచ్చు. పిస్తా పప్పును 100 గ్రాముల మేర తినడం ద్వారా సుమారుగా 20 గ్రాముల వరకు ప్రోటీన్లను పొందవచ్చు. రోజూ గుప్పెడు పిస్తా పప్పును తింటున్నా కూడా ప్రోటీన్లు మనకు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి మనల్ని అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉంచుతాయి.
జీడిపప్పులో కేవలం ప్రోటీన్లు మాత్రమే కాదు మన శరీరానికి ఉపయోగపడే అనేక రకాల విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. దీంతో గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే బరువు పెరగకుండా ఉంటారు. ఇక 100 గ్రాముల జీడిపప్పును తింటే సుమారుగా 18.22 గ్రాముల మేర ప్రోటీన్లను పొందవచ్చు. అలాగే ప్రోటీన్ల కోసం పల్లీలను కూడా తినవచ్చు. వీటికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. పైగా ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. 100 గ్రాముల పల్లీలను తింటే సుమారుగా 25.80 గ్రాముల మేర ప్రోటీన్లను పొందవచ్చు. చాలా మంది ఫిట్నెస్ ట్రెయినర్లు కూడా పల్లీలను తినాలని సూచిస్తుంటారు. కనుక వీటిని రోజూ నానబెట్టి తింటే ఫలితం ఉంటుంది. ఇలా పలు రకాల నట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ప్రోటీన్లను సమృద్ధిగా పొందవచ్చు.