ప్రోస్టేట్ క్యాన్సర్.. పురుషుల తొలి శత్రువు. అందులోనూ వయసు పైబడిన వారిని ఈ వ్యాధి లక్ష్యం చేసుకుంటుంది. నిశ్శబ్దంగా విస్తరిస్తుంది. పరిపూర్ణ ఆరోగ్యవంతులనూ వదిలిపెట్టదు. ఈ వ్యాధిని ఎంత త్వరగా గుర్తించి, అంత త్వరగా చికిత్స అందిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ప్రోస్టేట్ క్యాన్సర్ పురుషుల్లో వచ్చే రెండో సాధారణ క్యాన్సర్. అసలు ఈ ప్రోస్టేట్ గ్రంథి అంటే ఏమిటి? అది మన శరీరంలో ఎక్కడ ఉంటుంది? ప్రోస్టేట్ క్యాన్సర్‌కు కారణాలు, వ్యాధి లక్షణాలు, చికిత్సా పద్ధతులు తదితర అంశాలను అవగాహన చేసుకుందాం.
పురుషుల్లో సంభవించే క్యాన్సర్ మరణాల కారకాలలో ప్రోస్టేట్ క్యాన్సర్‌ది 5వ స్థానం. ప్రపంచవ్యాప్తంగా 2022లో 14 లక్షల కొత్త కేసులు నమోదవగా అందులో 3లక్షల 96వేల మంది మృత్యువాత పడినట్టు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 2040 నాటికి కొత్త కేసుల సంఖ్య ఇరవై నాలుగు లక్షలకు పెరిగి, మరణాల సంఖ్య ఏడు లక్షలకు పైగా నమోదు కావచ్చని అంచనా. భారత్‌లో ఈ కేసులను పరిశీలిస్తే 2020లో 40వేల కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక క్యాన్సర్ల కారణంగా సంభవించే మరణాలలో ప్రోస్టేట్ క్యాన్సర్ మరణాలు 4వ స్థానంలో ఉన్నట్టు తెలుస్తున్నది.
ప్రోస్టేట్ క్యాన్సర్ ఒకప్పుడు విదేశాల్లో ఎక్కువగా కనిపించేది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, కాలుష్యం, హానికరమైన రసాయనాల వినియోగం, వ్యాధిపై అవగాహన లేకపోవడం, సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోకపోవడం తదితర కారణాలతో ఇప్పుడు మనదేశంలో సైతం వేగంగా విస్తరిస్తున్నట్టు వైద్యులు హెచ్చరిస్తున్నారు. విదేశాల్లో తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తిస్తున్నారు. కానీ, మనదేశంలో వివిధ కారణాల వల్ల పరీక్షలు చేయించుకోవడం లేదు. దీంతో ముదిరిపోయే వరకు వ్యాధిని గుర్తించలేకపోతున్నారు. దీనివల్ల జరగరాని నష్టం జరిగిపోతుంది.
ప్రోస్టేట్ గ్రంథి మూత్రాశయం దిగువన మూత్రనాళాన్ని అంటుకుని నేరేడుకాయ పరిమాణంలో ఉంటుంది. యుక్త వయసులో పురుషులలో వీర్యం తయారీకి అవసరమైన 50 శాతం స్రావాలను ఇది ఉత్పత్తి చేస్తుంది. అంటే, పునరుత్పత్తి వ్యవస్థలో ఈ గ్రంథిది ముఖ్యపాత్ర అన్నమాట. అందుకే దీన్ని పౌరుష గ్రంథి అని కూడా పిలుస్తారు. వయసు పైబడేకొద్దీ ప్రోస్టేట్ గ్రంథి పరిమాణం కూడా పెరుగుతుంది. సాధారణంగా ఈ గ్రంథి 15 గ్రాముల బరువు ఉంటుంది. 50 ఏండ్లు దాటినవారిలో ఈ గ్రంథి బరువు క్రమంగా పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల మూత్రనాళం కుంచించుకుపోయి మూత్ర విసర్జనలో అవరోధం ఏర్పడుతుంది. ఎక్కువ శాతం ప్రోస్టేట్ గ్రంథి పరిమాణం పెరుగుదలకు కారణం.. మీరిపోతున్న వయసే. ఇలా పెరిగే ప్రోస్టేట్ గ్రంథిని బీపీహెచ్ (బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ప్లేజియా) అంటారు. అయితే ప్రోస్టేట్ క్యాన్సర్‌లో కూడా ఈ లక్షణాలే కనిపిస్తాయి. దీంతో రోగులు సమస్య వయసు వల్ల వచ్చిందా, లేక క్యాన్సర్ వల్ల వచ్చిందా అనే సంగతి తెలుసుకోలేక అయోమయానికి గురయ్యే అవకాశం లేకపోలేదు.
మూడు, నాలుగు దశల వారికి హార్మోనల్ థెరపీ, కీమో థెరపీ ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల వ్యాధిని పూర్తిగా నయం చేయలేం కానీ, రోగి జీవిత కాలాన్ని పెంచవచ్చు. ప్రోస్టేట్ క్యాన్సర్‌ను నిలువరించడానికి ఒక్కటే పరిష్కార మార్గం.. ఆ వ్యాధిపట్ల అప్రమత్తంగా ఉండటం. యాభై ఏండ్లు దాటిన ప్రతి పురుషుడూ తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవడం. మూత్ర వ్యవస్థలో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా.. వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించడం. ఆలస్యం చేసినకొద్దీ క్యాన్సర్ ఇతర భాగాలకూ విస్తరిస్తుంది. కొన్నిసార్లు ఈ వ్యాధి వారసత్వంగా రావచ్చు. ఆరోగ్యవంతమైన జీవనశైలి ప్రోస్టేట్ క్యాన్సర్‌ను నిలువరించలేకపోవచ్చు. కానీ, ఆ వ్యాధిని ఎదిరించే ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి, వ్యసనాలను దూరం చేసుకుని.. ఆరోగ్యవంతమైన ఆహారానికి పళ్లెంలో చోటివ్వండి. వ్యాయామానికి తగినంత సమయం కేటాయించండి. ఊబకాయాన్ని దూరం పెట్టండి.
ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్ తొలి రెండు దశలలో ఉన్నప్పుడు రోబోటిక్ చికిత్స ద్వారా సంపూర్ణంగా నయం చేయవచ్చు. రోబోటిక్ చికిత్స అత్యాధునిక పద్ధతి. ఈ మార్గంలో అతి సులభంగా ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్‌ను తొలగించవచ్చు. సాధారణంగా జరిపే ఓపెన్ సర్జరీ, ల్యాపరోస్కోపిక్ సర్జరీల కంటే రోబోటిక్ సర్జరీ వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి. రోగి ఎక్కువరోజులు దవాఖానలో ఉండాల్సిన అవసరం లేదు. సర్జరీ తర్వాత నొప్పి కూడా తక్కువే. సాధారణంగా క్యాన్సర్ శస్త్రచికిత్స తర్వాత కొంతమందిలో ఇతర సమస్యలు ఉత్పన్నం అవుతాయి. రోబోటిక్ సర్జరీతో ఆ ఇబ్బందులు చాలా తక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి.
– మహేశ్వర్‌రావు బండారి
– డా॥ ఎ.వి.కళ్యాణ్ కుమార్ కన్సల్టెంట్ యూరాలజి అండ్ ఆండ్రాలజి స్టార్ హాస్పిటల్, హైదరాబాద్