మేడమ్ నమస్తే. కొద్ది కాలం నుంచీ నాకు జననాంగంలో గడ్డ ఏర్పడినట్టు అనిపిస్తున్నది. అప్పుడప్పుడూ బయటికి కనిపిస్తుంది కూడా. డాక్టర్ దగ్గరికి వెళితే ‘ప్రొలాప్స్ యుటిరస్’ అని చెప్పారు. జారిపోయిన గర్భాశయం మళ్లీ పూర్వ స్థితికి వస్తుందా? ఆపరేషన్ లేకుండానే, మందులతో సమస్య తగ్గిపోతుందా?
‘ప్రొలాప్స్ యుటిరస్’ అంటే.. కండరాల బలహీనత వల్ల గర్భాశయం జారిపోవడం. కటి భాగంలోని లిగమెంట్స్ గర్భాశయాన్ని స్థిరంగా ఉంచుతాయి. గర్భాశయం కదలకుండా శరీరంతో కలిపి ఉంచే ప్రత్యేక కండరాలూ ఉంటాయి. ఆ లిగమెంట్స్, కండరాలు బలహీనపడటం వల్లే గర్భాశయం ఇలా కిందికి జారుతుంది. జననాంగాల గుండా గర్భాశయం బయటికి వస్తే.. విపరీతమైన నొప్పి ఉంటుంది. సరిగా నడవలేరు. పుండ్లు పడతాయి. సమస్య తీవ్రం మైతే గర్భాశయంతోపాటు మూత్రాశయం, పేగులు కూడా బయటికొచ్చే ప్రమాదం ఉంది. తుమ్మినా, దగ్గినా మూత్రం బయటపడుతుంది. ఇక, గర్భాశయం జారిపోవడానికి అనేక కారణాలు. కొందరిలో పుట్టుకతోనే కండరాల బలహీనత ఉంటుంది.
శారీరక శ్రమ, వ్యాయామం లేకపోవడం, పోషకాహార లోపం వల్ల కూడా ఇలా జరగవచ్చు. మొరటు పద్ధతుల్లో ప్రసవం చేసినా ఈ తరహా దుష్ఫలితాలు ఉంటాయి. ప్రసవం తర్వాత గర్భాశయ కండరాలు సహజంగానే బలహీనంగా ఉంటాయి. పూర్తి స్థాయిలో బలపడటానికి కనీసం పద్దెనిమిది నెలలు పడుతుంది. ఈలోగా మళ్లీ గర్భందాలిస్తే.. ప్రసవానికి ప్రసవానికి మధ్య ఎడం తగ్గుతుంది. ప్రసవాలకు మూడేళ్ల ఎడం లేకపోయినా ఈ సమస్య బారినపడే ప్రమాదం ఉంది. గర్భాశయం జారితే శస్త్ర చికిత్స తప్పదు. కానీ, చికిత్స అందరికీ ఒకేలా ఉండదు. సమస్య ప్రారంభ దశలో ఉంటే, కొన్ని వ్యాయామాల ద్వారా కొంతమేర నియంత్రించవచ్చు. సర్జరీ ద్వారా జల్లెడను పోలిన కృత్రిమ పొరలను అమర్చి అవయవాలను యథా స్థానంలో తీసుకొచ్చేందుకు నిపుణులు కృషి చేస్తారు. మరీ తీవ్రంగా ఉన్నప్పుడు.. గర్భాశయాన్ని తొలగించడమే పరిష్కారం.
– డాక్టర్ పి. బాలాంబ సీనియర్ గైనకాలజిస్ట్