Pregnant Women Foods | గర్భం దాల్చిన మహిళలు ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలను పాటించాలన్న విషయం అందరికీ తెలిసిందే. వారు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆ ఆహారం శిశువు ఎదుగుదలకు, పుట్టుక లోపాలు రాకుండా ఉండేందుకు సహాయం చేయాలి. అలాంటి ఆహారాన్నే గర్భిణీలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారి ఆహారంపై వైద్యులు, పోషకాహార నిపుణులు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. అయితే గర్భిణీలు కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం పూర్తిగా మానేయాలి. లేదంటే శిశువు ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. పుట్టుక లోపాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. గర్భిణీలు ఏ ఆహారం తీసుకోవాలనుకున్నా డాక్టర్ సలహా పాటిస్తే ఉత్తమం. లేదా పోషకాహార నిపుణులను సైతం సంప్రదించవచ్చు.
గర్భిణీలు ఎట్టి పరిస్థితిలోనూ రెడీ టు ఈట్ ఫుడ్స్‌ను అసలు తినకూడదు. తింటే వారికి పుట్టబోయే పిల్లలకు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. రెడీ టు ఈట్ ఫుడ్ అంటే ప్యాక్‌లో ఉండే ఆహారాలకు కొద్దిగా నీళ్లు కలిపి లేదా వేడి చేసి లేదా నూనె కలిపి వండేవి అన్నమాట. అలాంటి ఆహారాలను కేవలం కొన్ని నిమిషాల్లోనే వండవచ్చు. అలాంటి ఆహారాలనే తినకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక గర్భిణీలు చేపలు, రొయ్యలను తినడం మానేయాలి. ఎందుకంటే అవి సీ ఫుడ్ జాబితాకు చెందుతాయి. ఆ ఆహారంలో పాదరసం అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి ఆహారాలు శిశువు ఎదుగుదలపై ప్రభావం చూపిస్తాయి. కనుక వాటిని తినకపోవడమే మంచిది.
గర్భిణీలు ప్రాసెస్ చేయబడిన మాంసాహారాలను కూడా తినకూడదు. అలాంటి ఆహారాలను తప్పనిసరిగా తినాల్సి వస్తే కచ్చితంగా బాగా ఉడికించి తినాలి. కీమా రూపంలో తీసుకుంటే మేలు జరుగుతుంది. గర్భిణీలు ఎట్టి పరిస్థితిలోనూ కోడిగుడ్లను పచ్చిగా తినకూడదు. అలాంటి గుడ్లలో సాల్మొనెల్లా బ్యాక్టీరియా అధికంగా ఉంటుంది. ఇది తల్లికి, శిశువుకు ఇన్ఫెక్షన్లను కలిగించే ప్రమాదం ఉంటుంది. కనుక పచ్చి గుడ్లను తినకూడదు. బాగా ఉడకబెట్టిన గుడ్లను తింటే మేలు జరుగుతుంది. ఇవి అనేక పోషకాలను అందిస్తాయి. గర్భం దాల్చిన మహిళలు టీ, కాఫీలను అధికంగా తాగకూడదు. వీటిల్లో ఉండే కెఫీన్ ఆరోగ్యానికి హాని చేస్తుంది. గర్భస్థ శిశువు ఆరోగ్యంపై కెఫీన్ దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. కనుక టీ, కాఫీలను అతిగా సేవించకూడదు.
గర్భిణీలు మొలకెత్తిన గింజలను తినవచ్చు. కానీ నేరుగా తినకూడదు. మొలకల్లో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉంటుంది. కనుక వాటిని శుభ్రంగా కడిగి పెనంపై కాస్త వేయించి తింటే మేలు జరుగుతుంది. మొలకలకు కాస్త నెయ్యి కలిపి తింటే ఇంకా ఎంతో ఉపయోగం ఉంటుంది. గర్భిణీలు పాలను తాగే విషయంలోనూ జాగ్రత్తలను పాటించాలి. పాలను బాగా మరిగించి తాగాల్సి ఉంటుంది. లేదంటే సరిగ్గా జీర్ణం కావు. పాలను తాగితే అందులో చక్కెర కలపకుండా తాగాలి. అవసరం అనుకుంటే డాక్టర్ సూచన మేరకు అందులో కాస్త తేనె కలిపి తాగవచ్చు. ఇక ప్యాకెట్లలో అమ్మే పండ్ల రసాలను సైతం గర్భిణీలు తాగకూడదు. వీటిల్లో ఉండే రసాయనాలు బిడ్డ ఆరోగ్యపై ప్రభావం చూపిస్తాయి. కనుక పండ్ల రసాలను సేవిస్తే ఇంట్లోనే సహజసిద్ధంగా తయారు చేసి తాగాలి. ప్యాకెట్లలో ఉండేవి తాగకూడదు. ఇక గర్భిణీలు మద్యాన్ని ఎట్టి పరిస్థితిలోనూ సేవించకూడదు. ఇది బిడ్డ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అలాగే కూరగాయలను బాగా కడిగి వండిన తరువాతే తినాలి. జంక్ ఫుడ్‌ను పూర్తిగా మానేయాలి. ఇలా ఆహారం విషయంలో గర్భిణీలు జాగ్రత్తలు పాటిస్తే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. పుట్టుక లోపాలు లేకుండా జన్మిస్తారు.