న్యూఢిల్లీ : మధుమేహం, కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, క్యాన్సర్లు, గుండె జబ్బుల వంటి పలు వ్యాధుల బారినుంచి తప్పించుకోవాలంటే నిత్యం ఆహారంలో తృణధాన్యాలను సమృద్ధిగా తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. తృణధాన్యాల్లో పుష్కలంగా ఉండే ఫైబర్‌తో పాటు వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం మూలంగా పలు అనారోగ్యాల నుంచి మిల్లెట్స్ మనకు రక్షణ కల్పిస్తాయి. రక్తంలో చక్కెర నిల్వలను సమర్ధంగా నిర్వహించడంలో మిల్లెట్స్ కీలక పాత్ర పోషిస్తాయి.
జీఐ తక్కువగా ఉండటంతో పాటు వీటిలో ఉండే అధిక ఫైబర్ మధుమేహాన్ని సమర్ధంగా నియంత్రిస్తుంది. ఎముకలు, కండరాల పుష్టికి తృణధాన్యాలు మేలు చేస్తాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. మిల్లెట్స్‌లో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్ ఎముకల ఆరోగ్యానికి ఉపకరిస్తాయి. మిల్లెట్స్‌లో ఫైబర్, ప్రొటీన్, ఇతర పోషకాలు జీవక్రియల వేగం పెంచి జీర్ణక్రియలు సాఫీగా సాగేలా చూస్తాయి. మిల్లెట్స్‌లో ఉండే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను తగ్గిస్తాయి.
మంచి కొలెస్ట్రాల్ హెచ్‌డీఎల్‌ను పెంచడంతో పాటు చెడు కొలెస్ట్రాల్ ఎల్‌డీఎల్‌ను తగ్గిస్తూ మెరుగైన కొలెస్ట్రాల్ లెవెల్స్ మెయింటెన్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. గ్లూటెన్ రహిత ఆహారంగా మిల్లెట్స్ ప్రాచుర్యం పొందాయి. గ్లూటెన్ ఇన్టాలరెన్స్ కలిగిన వారు కూడా వీటిని నిరభ్యంతరంగా తీసుకుని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. రాగులు, సజ్జలు, జొన్నలు, సామలు, అరికలు, అలసందలు, ఉలవలు వంటి తృణధాన్యాలను తరచూ తీసుకోవడం ద్వారా మెరుగైన ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.