Type 2 Diabetes | డయాబెటిస్‌లో రెండు రకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. టైప్ 1, టైప్ 2 అని షుగర్ వ్యాధి రెండు రకాలుగా ఉంటుంది. మొదటి రకం డయాబెటిస్ ఉన్నవారిలో క్లోమగ్రంథి సరిగ్గా పనిచేయదు. రెండో రకం డయాబెటిస్ ఉంటే క్లోమగ్రంథి సరిగ్గానే పనిచేస్తుంది. కానీ ఇన్సులిన్‌ను శరీరం సరిగ్గా గ్రహించదు. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇలా రెండు రకాల డయాబెటిస్‌లతో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది బాధపడుతున్నారు. అయితే టైప్ 1 డయాబెటిస్ కన్నా ప్రస్తుతం టైప్ 2 డయాబెటిస్ బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. ఒకప్పుడు టైప్ 2 డయాబెటిస్ కేవలం వయస్సు మీద పడిన వారిలోనే వచ్చేది. కానీ ఇప్పుడు ఇది యుక్త వయస్సులో ఉన్నవారికి కూడా వస్తోంది. దీంతో చాలా మంది షుగర్ బారిన పడి తీవ్ర అవస్థలను ఎదుర్కొంటున్నారు. అయితే టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్లు ఇచ్చే మందులను వాడడంతోపాటు పలు ఇంటి చిట్కాలను పాటించడం వల్ల షుగర్ లెవల్స్‌ను సమర్థవంతంగా నియంత్రణలో ఉంచుకోవచ్చు.
టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి మెంతులు అద్భుతంగా పనిచేస్తాయి. మెంతులను రెండు టీస్పూన్ల మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ మెంతులను తిని అనంతరం ఆ నీళ్లను తాగాలి. ఇలా రోజూ చేస్తుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. టైప్ 2 డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అయితే మెంతులను నేరుగా తినలేని వారు వీటి పొడిని గోరు వెచ్చని నీటిలో కలిపి తాగవచ్చు. లేదా మజ్జిగలోనూ కలిపి సేవించవచ్చు. ఇక మార్కెట్లో మెంతులతో తయారు చేసే ట్యాబ్లెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని రోజుకు 2 సార్లు పూటకు 500 ఎంజీ చొప్పున భోజనానికి ముందు వేసుకోవాల్సి ఉంటుంది. వీటిని ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో వాడాలి. ఇలా చేస్తున్నా కూడా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది.
కాకరకాయలను చాలా మంది తినరు. చేదుగా ఉంటాయని వీటిని దూరం పెడతారు. కానీ షుగర్ లెవల్స్‌ను తగ్గించడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. రోజూ కాకరకాయలను తింటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. లేదా రోజూ ఉదయం పరగడుపునే 30 ఎంఎల్ మోతాదులో కాకరకాయ రసం సేవిస్తుండాలి. దీని వల్ల షుగర్ అదుపులో ఉంటుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. అలాగే దాల్చిన చెక్క పొడిని వాడుతున్నా కూడా ఉపయోగం ఉంటుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగుతుండాలి. దీని వల్ల కూడా షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. అలాగే విటమిన్ సి అధికంగా ఉండే నిమ్మ, నారింజ వంటి పండ్లను రోజూ తీసుకోవాలి. ఇవి బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తాయి. మనకు రోజూ 600 మిల్లీగ్రాముల మోతాదులో విటమిన్ సి అందేలా చూసుకోవాలి. దీంతో కూడా డయాబెటిస్‌ను అదుపు చేయవచ్చు.
ఇక రోజూ ఉదయాన్నే పరగడుపునే 30 ఎంఎల్ మోతాదులో కలబంద రసాన్ని తీసుకుంటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. షుగర్ లెవల్స్‌ను తగ్గించడంలో, డయాబెటిస్ ను అదుపులో ఉంచడంలో ఇది కూడా అద్భుతంగా పనిచేస్తుంది. కలబంద రసాన్ని సేవిస్తే జీర్ణ వ్యవస్థ సైతం ఆరోగ్యంగా ఉంటుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే చర్మానికి తేమ లభించి మృదువుగా మారుతుంది. కాంతివంతంగా కనిపిస్తుంది. చలికాలంలో చర్మం పగలకుండా ఉంటుంది. అలాగే ఉసిరికాయలను తింటున్నా కూడా డయాబెటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. ఉసిరికాయలు మనకు ఈ సీజన్లో అధికంగా లభిస్తాయి. వీటిని పూటకు ఒకటి చొప్పున తింటుండాలి. లేదా ఉదయం పరగడుపునే 30 ఎంఎల్ మోతాదులో ఉసిరికాయల రసం తాగాలి. వీటిల్లో ఉండే విటమిన్ సి, క్రోమియం షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. ఇలా ఆయా చిట్కాలను పాటిస్తుంటే టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది.