Proteins | సాధారణంగా 40 ఏళ్ల తర్వాత ఆరోగ్యంగా, చురుకుగా జీవించడం అనేది ఇప్పటి కాలంలో కొత్త లక్ష్యంగా మారుతోంది. కేవలం ఎక్కువకాలం బ్రతకడం మాత్రమే కాకుండా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా జీవించడంపై ప్రజలు ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆహారం పాత్ర ఎంతో కీలకంగా మారింది. ముఖ్యంగా ప్రోటీన్ తీసుకోవడం ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి ఆధారంగా నిలుస్తోందని నిపుణులు చెబుతున్నారు. 40 ఏళ్ల వయసులోకి వచ్చిన తర్వాత శరీరంలో మార్పులు ప్రారంభమవుతాయి. ఈ దశలో సమతుల్య ఆహారం తప్పనిసరి అయినప్పటికీ, ప్రత్యేకంగా ప్రోటీన్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం పెరుగుతుంది. సరిపడా ప్రోటీన్ తీసుకోకపోతే క్రమంగా కండరాల ద్రవ్యరాశి తగ్గిపోతుంది. దీనివల్ల శక్తి, చలనం (మొబిలిటీ), శరీర పనితీరు దెబ్బతింటాయి. మునుపటి కాలంలో ప్రోటీన్‌ను క్రీడాకారులు లేదా బాడీ బిల్డర్లకు మాత్రమే అవసరమని భావించేవారు. అయితే ఇప్పుడు అన్ని వయస్సుల వారికి, ముఖ్యంగా 40 ఏళ్ల తర్వాత, ఇది అత్యంత అవసరమైన పోషకంగా గుర్తిస్తున్నారు. ఇది కండరాల బలం మాత్రమే కాకుండా, మొత్తం శరీర ఉత్సాహాన్ని, ఆరోగ్యాన్ని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
దేశంలో చాలా మంది తీసుకునే ఆహారం ప్రధానంగా ధాన్యాలపై ఆధారపడి ఉంటుంది. ఇవి శక్తిని అందించినప్పటికీ, ప్రోటీన్ మాత్రం తక్కువగా ఉండే అవకాశం ఉంది. తాజా అధ్యయనాల ప్రకారం, నగర ప్రాంతాల్లో 70 శాతం మందికి పైగా అవసరమైన ప్రోటీన్ మోతాదుకు తక్కువగా తీసుకుంటున్నారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఈ లోపం మరింత పెరుగుతోంది. ప్రోటీన్ లోపం క్రమంగా కనిపిస్తోంది. కండరాల బలహీనత, అలసట, రోగనిరోధక శక్తి తగ్గడం, త్వరగా అలసిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వయస్సు పెరిగే కొద్దీ కండరాల ద్రవ్యరాశి తగ్గే పరిస్థితిని సార్కోపేనియా అంటారు. ఇది పెరిగితే మెట్లు ఎక్కడం, బరువులు మోయడం వంటి సాధారణ పనులు కూడా కష్టంగా మారుతాయి. అంతేకాకుండా వయస్సు పెరిగినప్పుడు శరీరం ప్రోటీన్‌ను సరిగ్గా వినియోగించుకోలేని స్థితి (అనబాలిక్ రెసిస్టెన్స్) కూడా ఏర్పడుతుంది. దీంతో కండరాలను నిలబెట్టుకోవడానికి మరింత ప్రోటీన్ అవసరం అవుతుంది.
ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం పెద్ద మార్పులు అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. చిన్నచిన్న ఆహారపు మార్పులు కూడా పెద్ద ప్రయోజనం ఇస్తాయి. సాధారణ గోధుమ పిండికి బదులుగా ప్రోటీన్ అధికంగా ఉండే పిండి వాడటం, ఆహారంలో పనీర్, సోయా లేదా మాంసాహారం చేర్చడం మంచిది. అల్పాహారం, రాత్రి భోజనాల్లో కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తగ్గించి, ఓట్స్ వంటి ప్రోటీన్, ఫైబర్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ఉపయోగకరం. ఇలాంటి ఆహారం శరీరానికి స్థిరమైన శక్తిని అందిస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది, గుండె, కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే మునగాకుల పొడి వంటి ప్రోటీన్ అధికంగా ఉన్న పదార్థాలను కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు.
స్నాక్స్ విషయంలో కూడా జాగ్రత్త అవసరం. 40 ఏళ్ల తర్వాత తినే ప్రతి ఆహారం శరీరానికి ఉపయోగపడేలా ఉండాలి. నట్స్, గింజలు, సంపూర్ణ ధాన్యాలు, ప్రోటీన్ అధికంగా ఉండే స్నాక్స్ తీసుకోవడం మంచిది. 40 ఏళ్ల తర్వాత ప్రోటీన్ అనేది అప్పుడప్పుడు తీసుకునే పదార్థం కాదు, ప్రతి రోజు ఆహారంలో భాగం కావాలి. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం 60లలో కాదు, 40 నుంచే ప్రారంభమవుతుందని నిపుణులు చెబుతున్నారు.