Pre Diabetes | ప్రస్తుత కాలంలో భారతదేశంలో ప్రీడయాబెటిస్ సమస్య వేగంగా పెరుగుతోంది. ఐసీఎంఆర్-ఇండియాబ్ అధ్యయనం ప్రకారం దేశ జనాభాలో సుమారు 15.3 శాతం మంది ప్రీడయాబెటిస్తో బాధపడుతున్నారు. ఇది దాదాపు 13.6 కోట్ల మందికి సమానం. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ పరిస్థితి టైప్-2 డయాబెటిస్‌గా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధిక మోతాదులో విటమిన్-డి సప్లిమెంట్లు కొంతమందిలో డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ పరిశోధనను అమెరికాలోని టఫ్ట్స్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించారు. అధ్యయన ఫలితాలు జామా నెట్వర్క్ ఓపెన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
పరిశోధకులు ముందుగా నిర్వహించిన డి2డి ట్రయల్ డేటాను మళ్లీ విశ్లేషించారు. ఇందులో పాల్గొన్న పెద్దలకి రోజుకు 4,000 ఐయూ విటమిన్-డి లేదా ప్లాసీబోను సుమారు రెండున్నరేళ్ల పాటు ఇచ్చారు. మొదటి దశలో జరిగిన డి2డి అధ్యయనంలో పాల్గొన్నవారిలో డయాబెటిస్ ప్రమాదం తగ్గినట్టు స్పష్టమైన ఫలితాలు కనిపించలేదు. అయితే తాజా విశ్లేషణలో కొన్ని ప్రత్యేక జన్యు లక్షణాలు ఉన్నవారికి విటమిన్-డి వల్ల ప్రయోజనం కలిగినట్టు గుర్తించారు. ఈ పరిశోధనలో భాగంగా 2,098 మంది పాల్గొన్నవారి డీఎన్ఏ నమూనాలను పరీక్షించారు. ముఖ్యంగా విటమిన్-డి రిసెప్టర్ (వీడీఆర్) జీన్లలో ఉండే మూడు సాధారణ వేరియంట్లను పరిశీలించారు. రక్త పరీక్షల ద్వారా ఫాస్టింగ్ గ్లూకోజ్ 126 ఎంజీ/డీఎల్ కంటే ఎక్కువగా ఉండటం, రెండు గంటల తర్వాత గ్లూకోజ్ 200 ఎంజీ/డీఎల్ దాటడం లేదా హెచ్‌బీఏ1సీ 6.5 శాతానికి మించితే డయాబెటిస్‌గా నిర్ధారించారు. అధ్యయనం ప్రకారం వీడీఆర్ జీన్‌లో ఏపాల్ ప్రాంతంలో ఏసీ లేదా సీసీ రకాల వేరియంట్లు ఉన్నవారిలో విటమిన్-డి సప్లిమెంట్లు తీసుకున్నప్పుడు డయాబెటిస్ ప్రమాదం సుమారు 19 శాతం వరకు తగ్గినట్టు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 శాతం మందిలో ఈ వేరియంట్లు ఉండే అవకాశముందని పరిశోధకులు చెబుతున్నారు.
అయితే ఏఏ వేరియంట్ ఉన్నవారిలో మాత్రం ఈ ప్రయోజనం కనిపించలేదని వెల్లడించారు. విటమిన్-డి శరీరంలో ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్యాంక్రియాస్‌లో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల్లో విటమిన్-డి రిసెప్టర్ ప్రోటీన్లు ఉంటాయి. ఇవి యాక్టివ్ విటమిన్-డితో కలిసి పనిచేస్తాయి. అయితే జీన్లలో ఉండే మార్పుల వల్ల ఈ ప్రక్రియ ప్రభావితం అవుతుందని పరిశోధకులు వివరిస్తున్నారు. అధ్యయనంలో ఉపయోగించిన 4,000 ఐయూ విటమిన్-డి మోతాదు సాధారణంగా సూచించే రోజువారీ 600 నుంచి 800 ఐయూ కంటే చాలా ఎక్కువ. అయినప్పటికీ ట్రయల్ సమయంలో తీవ్రమైన దుష్ప్రభావాలు కనిపించలేదని పరిశోధకులు పేర్కొన్నారు.
అయితే వైద్యుల సలహా లేకుండా అధిక మోతాదులో విటమిన్-డి ని తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. అధికంగా తీసుకుంటే విటమిన్-డి టాక్సిసిటీ ప్రమాదం ఉంటుందని సూచిస్తున్నారు. భవిష్యత్తులో ప్రీడయాబెటిస్ ఉన్నవారిలో ఎవరికి విటమిన్-డి సప్లిమెంట్లు ఎక్కువ ప్రయోజనం ఇస్తాయో జన్యు పరీక్షల ద్వారా ముందుగానే గుర్తించే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఇది వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా చికిత్సలు అందించే పర్సనలైజ్డ్ మెడిసిన్ దిశగా ఒక ముందడుగుగా భావిస్తున్నారు. అయితే నిపుణులు జీవనశైలినే అత్యంత కీలక అంశంగా పేర్కొంటున్నారు. సమతుల ఆహారం, క్రమమైన వ్యాయామం, యోగా, బరువు నియంత్రణ వంటి అలవాట్లు డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. విటమిన్-డి సప్లిమెంట్లు కొన్ని జన్యు లక్షణాలు ఉన్నవారికి అదనపు రక్షణగా ఉపయోగపడే అవకాశం ఉందని సూచిస్తున్నారు.