Black Gram | మన శరీరానికి పప్పు దినుసులు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల ప్రోటీన్ తో పాటు ఇతర ముఖ్యమైన పోషకాలు ఎన్నో లభిస్తాయి. రోజూ పప్పు దినుసులను ఆహారంలో భాగంగా తీసుకోవడం మన శరీరానికి ఎంతో అవసరం. మనం ఆహరంగా తీసుకునే పప్పు దినుసుల్లలో మినుములు కూడా ఒకటి. వీటిని పొట్టుతో, మర ఆడించి పొట్టు లేకుండా కూడా తీసుకుంటూ ఉంటారు. మినుములతో మనం అనేక రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. దోశ, వడ, ఇడ్లీ, కిచిడీ వంటి వాటితో పాటు సున్నుండలు, మురుకులు వంటి పిండి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. మినుములతో చేసే వంటకాలను తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. మినుముల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజు వారీ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
మినుముల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో కరిగే, కరగని ఫైబర్ కూడా సమృద్దిగా ఉంటుంది. కనుక వీటిని తీసుకోవడం వల్ల ప్రేగు కదలికలు ఎక్కువగా ఉంటాయి. మలబద్దకం సమస్య తగ్గుతుంది. మనం తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. మలబద్దకం సమస్యతో బాధపడే వారు మినుములను పొట్టుతో సహా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మినుముల్లో మెగ్నీషియంతో పాటు పొటాషియం కూడా ఉంటుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. అధిక రక్తపోటుతో బాధపడే వారికి మినుములు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. మినుములను తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మినుముల్లో క్యాల్షియం, భాస్వరం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో, ఎముకలను దృఢంగా చేయడంలో, ఎముకల సాంద్రతను పెంచడంలో దోహదపడతాయి.
మినుముల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ లోపం లేకుండా ఉంటుంది. దీంతో శరీరంలో ఎర్ర రక్తకణాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. రక్తహీనత సమస్య తలెత్తకుండా ఉంటుంది. శరీరమంతా ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది. దీని వల్ల శరీర అలసట తగ్గుతుంది. తరచూ నీరసం, అలసట వంటి సమస్యలతో బాధపడే వారు మినుములను తీసుకోవడం వల్ల అలసట తగ్గడంతో పాటు శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది. మినుముల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ తో పోరాడడం వల్ల వృద్దాప్య ఛాయలు తగ్గుతాయి. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. బరువు తగ్గడంలో కూడా మినుములు మనకు దోహదపడతాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీని వల్ల మన శరీరంలోకి క్యాలరీలు తక్కువగా చేరుతాయి. తద్వారా శరీర బరువు అదుపులో ఉంటుంది.
ఇక మినుములలో జింక్, బి విటమిన్లు కూడా ఉంటాయి. కనుక వీటిని తీసుకోవడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధుల బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ విధంగా మినుములు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మొత్తం ఆరోగ్యానికే మేలు కలుగుతుందని వారు చెబుతున్నారు. పిల్లలకు కూడా మినుములతో చేసిన ఆహారాలను ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుందని వారు సూచిస్తున్నారు.