వేసవి అంటేనే.. మామిడి పండ్లు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతోపాటు మరెంతో రుచికరంగా ఉండే ఈ పండును ఇష్టపడని వారు ఉండరు. అయితే, కొందరికి మామిడి పండ్లు విషంతో సమానమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటివారు వీటికి దూరంగా ఉండటమే మంచిదని సలహా ఇస్తున్నారు.
మధుమేహంతో బాధపడుతున్న వారు మామిడిపండును తక్కువగా తీసుకోవాలి. ఇందులో ఉండే ఫ్రక్టోజ్.. రక్తంలో చక్కెర స్థాయులను హఠాత్తుగా పెంచుతుంది. దీంతో వారి ఆరోగ్యంపై తీవ్రప్రభావం పడుతుంది. ఇలాంటివారు డైటీషియన్ సలహా మేరకు, రక్తంలో చక్కెర స్థాయులను పరీక్షించుకుంటూ మామిడి పండ్లను తీసుకోవాలి.
జీర్ణ సమస్యలు ఉన్నవారికీ ఈ పండు తినడం ఇబ్బందికరమే! మామిడి పండ్లు ఎక్కువగా తీసుకుంటే.. కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి సమస్యలు వస్తాయి. మామిడిపండ్లకు పాలు కలిపి తయారుచేసే మ్యాంగో షేక్.. జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది.
ఇక బరువు తగ్గాలని అనుకునేవారు కూడా మామిడిని పక్కన పెట్టేస్తేనే మంచిది. 100 గ్రా. మామిడి పండు తింటే.. 60-70 క్యాలరీలు శరీరానికి అందుతాయి. వీటితోపాటు ఇందులో అధికంగా ఉండే చక్కెర స్థాయులు కూడా బరువును అమాంతం పెంచేస్తాయి.
అలర్జీలు ఉన్నవారికి మామిడి పండు హాని కలిగిస్తుంది. దురదలు, వాపు, శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.
మామిడిలో విటమిన్ ఎ అధికంగా లభిస్తుంది. దీన్ని ఎక్కువగా తీసుకుంటే.. ‘హైపర్ విటమిన్ -ఎ’కు దారితీస్తుంది. దీనివల్ల వికారం, తల తిరగడం, తలనొప్పి లాంటి లక్షణాలను కలిగిస్తుంది. సమస్య మరింత ముదిరితే.. కాలేయంపైనా ప్రభావం చూపుతుంది.