మా పాప వయసు ఒక సంవత్సరం. ఆరోగ్యంగా ఉంది. వ్యాక్సిన్ వేయించడానికి హాస్పిటల్కి వెళ్లినప్పుడు పిల్లలకు ఫోన్ ఇవ్వడం, టీవీ చూపించడం చేయొద్దని పీడియాట్రీషియన్ చెప్పారు. మా పాప ఇప్పుడిప్పుడే ఫోన్ చూస్తున్నది. ఫోన్ చూస్తే మరీ అంత ప్రమాదమా? దయచేసి సలహా ఇవ్వగలరు?
ఇది మంచి ప్రశ్న. ఒకటి నుంచి మూడు సంవత్సరాల వయసులోపు పిల్లల్లో భాష బాగా అభివృద్ధి చెందుతుంది. చుట్టుపక్కల వాళ్లు మాట్లాడే మాటలు వింటూ పిల్లలు భాషను నేర్చుకుంటారు. పిల్లలు ఎన్నిసార్లు మాట్లాడటానికి ఎక్స్పోజ్ అయితే అంత మంచిది. దురదృష్టవశాత్తు ఈ తరం పిల్లలు వాళ్ల వయసు ఉన్న చిన్నారులతో కలిసి ఉండే సమయం తగ్గిపోతున్నది. ఫోన్, టీవీకి పరిమితమయ్యే పిల్లల్లో అర్థం చేసుకునే శక్తి తగ్గుపోతుంది. విన్న మాటలను ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలన్నా గ్రహింపు శక్తిని కోల్పోతారు. సామాజిక అవగాహన పొందలేరు. అందువల్ల పిల్లల ప్రవర్తనలో విపరీత ధోరణి పెరుగుతుంది. కొందరిలో ఇది ఆటిజానికి దారితీయొచ్చు. మీ పీడియాట్రీషియన్ హెచ్చరించినట్టు.. దయచేసి పిల్లలకు ఫోన్, టీవీ అలవాటు చేయకండి. అది వ్యసనంగా మారుతుంది.
చుట్టుపక్కల ఉన్న మనుషులతో మాట్లాడుతూ మాటలు నేర్చుకోవడానికి దూరమవుతారు. కాబట్టి, ఒకటి నుంచి మూడు సంవత్సరాల లోపు పిల్లలు శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా ఎదిగేటువంటి ప్రత్యేకమైన స్థితిలో ఉండాలి. వాళ్లు నడవడం, పరుగెత్తడం చేయాలి. సమాజంలో అందరినీ పరిశీలిస్తూ ఉండాలి. ఇతరుల మాటలు, భాషను వినడం వల్ల సమాజాన్ని అర్థం చేసుకుంటారు. ఫోన్, ట్యాబ్, టీవీకి అలవాటైతే అలాంటి అవకాశాన్ని కోల్పోతారు. కాబట్టి వైద్యులు చెప్పిన సలహా పాటించండి. మీకు తెలిసిన వాళ్లకు చెప్పండి. టీవీ, ఫోన్ చూడొద్దని చెప్పి, మీరు చూస్తూ ఉంటే.. పిల్లలు మీ మాటలు అంగీకరించరు, ఆచరించరు. కాబట్టి పెద్దలు కూడా స్వీయ నియంత్రణ పాటించాలి.
– డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్