దుకాణాలు, సూపర్ మార్కెట్లలో ప్యాక్ చేసిన కూరగాయలు గానీ, ముందే కొంతమేరకు తరిగిన ఉత్పత్తులను గానీ కొంటున్నారా? అయితే, జాగ్రత్తగా ఉండాల్సిందే! వీటిలో ఇ.కొలి బ్యాక్టీరియా ఉండొచ్చని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఈ బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం పొంచి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి, దుకాణాలు, సూపర్ మార్కెట్లలో ఆకుకూరల్లాంటివి కొన్న తర్వాత వాటిని ఇంటి దగ్గర మళ్లీ పరిశుభ్రంగా కడుక్కోవాలి. పేపర్ టవల్స్లో చుట్టి పెట్టుకోవాలి. అంతేకాకుండా ఏవైనా ఆకులు చిట్లిపోయి ఉంటే వాటిని తీసిపారేయాలి. వీటిలో బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది. ఇక పోషకాలు సమృద్ధిగా ఉండే మొలకల విషయానికి వస్తే, వీటిని ఉత్పత్తి చేసేటప్పుడు వెచ్చటి ఉష్ణోగ్రతకు గురిచేస్తారు. దాంతో గింజలు నీళ్లలో మొలకెత్తేలా పోషకాలను విడుదల చేస్తాయి. అయితే, వెచ్చటి వాతావరణంలో మొలకలపై బ్యాక్టీరియా వృద్ధిచెందడానికి అవకాశం ఉంటుంది. చాలావరకు పండ్లు, ముఖ్యంగా ఎక్కువ కాలంపాటు నిల్వ ఉంచినవి కూడా మన ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయి. అన్నట్టు ఎక్కువసేపు నిల్వ ఉంచిన తరిగిన పండ్ల ముక్కలను కూడా తినొద్దట. చూడటానికి ఇవి తాజాగానే అనిపించినప్పటికీ కంటికి కనిపించని బ్యాక్టీరియా వృద్ధి చెందవచ్చని ఆహార నిపుణులు అంటున్నారు.