Walking | వ్యాయామం చేయడం అన్నది మెరుగైన జీవితానికి, దీర్ఘాయుష్షుకి దోహదం చేస్తుందన్నది చాలాకాలం నుంచీ తెలిసిన విషయమే. అయితే ఎంత వ్యాయామం చేస్తే ఎంత మేరకు ఉపయోగపడుతుంది అన్న విషయం మీద ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ యూనివర్సిటీలో ఓ పరిశోధన జరిగింది. దీని ప్రకారం ఒక వ్యక్తి క్రమబద్ధంగా వర్కవుట్లు చేయడం వల్ల, అవేమీ చేయని వారితో పోలిస్తే 11 సంవత్సరాలు ఎక్కువ ఆయుష్షుని పొందవచ్చని తేలింది. అంతేకాదు, ఒక గంట నడక అన్నది ఆరు గంటల జీవితకాలాన్ని పెంచుతుందనీ అంచనా వేశారు ఇక్కడి పరిశోధకులు. యాక్సెలోమెట్రీ అనే ప్రత్యేక పద్ధతి ద్వారా ఈ విషయాలను లెక్కగట్టారు.
40 ఏండ్లు దాటిన వారు కూడా రోజుకు మూడు గంటల నడకకు సమానమైన వ్యాయామం చేయడం ద్వారా దాదాపు 5 సంవత్సరాల జీవితాన్ని పెంచుకోవచ్చంటున్నారు. అంటే నడకతో పాటు, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ ఇతర వర్కవుట్లు, మెట్లు ఎక్కడం చివరికి డ్యాన్స్ చేయడం ఇలా శరీరాన్ని కదిల్చే ఏ పని అయినా దీని కిందకి తీసుకోవచ్చు. కదలకుండా కూర్చోవడం కాకుండా శరీరాన్ని ఏదో ఒక రీతిలో కదపడం అన్నది షుగర్, బీపీ, క్యాన్సర్, గుండెజబ్బుల్లాంటి అనేక రోగాలను నియంత్రణలో ఉంచేందుకు సాయపడుతుందని వీళ్లు తేల్చారు. అలాగే వ్యాయామం చేయని వారితో పోలిస్తే చేసే వారిలో త్వరగా చనిపోయే ప్రమాదం 73 శాతం తక్కువ ఉందట.