Health tips : సాల్మన్ చేపలు వంటి ఫ్యాటీ ఫిష్ తరచూ తీసుకుంటే రుచికరమైన ఆహారంగానే కాకుండా పరిపూర్ణ ఆరోగ్యానికీ మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ చేపల్లో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రొటీన్లు, విటమిన్ డీ, బీ6 వంటివి తీవ్ర గుండె జబ్బుల బారినపడే ముప్పును తగ్గిస్తాయని తాజా అధ్యయనం వెల్లడించింది. సాల్మన్ చేపలను నిత్యం తీసుకుంటే ధమనుల్లో వ్యర్ధాలు పేరుకుపోయే స్ధితిగా చెప్పే అథెరోసెరోసిస్ ముప్పు తగ్గుతుందని జర్నల్ ఆఫ్ క్లినికల్ ఇన్వెస్టిగేషన్లో ప్రచురితమైన అధ్యయనంలో నిపుణులు వెల్లడించారు.
శరీరంలో వాపు ప్రక్రియతో పోరాడే మాలిక్యుల్స్‌ను ఒమెగా-3 ప్రేరేపిస్తుందని వివరించారు. ఒమెగా-3లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్లు, ఎముకల ఆరోగ్యానికి, మెదడు ఉత్తేజానికీ ఉపకరిస్తాయని తెలిపారు. ఇక చేపలతో పాటు వాల్నట్స్, చియా సీడ్స్, సోయా బీన్స్, ఫ్లాక్స్ సీడ్స్, కిడ్నీ బీన్స్, కనోలా ఆయిల్, ఆలివ్ ఆయిల్ వంటి ఆహార పదార్ధాల్లోనూ ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి.
సాల్మన్ ఇతర ఫ్యాటీ ఫిష్‌ను వారంలో కనీసం రెండు సార్లు ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండే ఇతర ఆహారాన్ని వారంలో ఎక్కువ రోజులు తీసుకుంటే మేలని నిపుణులు చెబుతున్నారు.