హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలం కొడవటంచ గ్రామ చెరువును కాపాడాలని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి కోరారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా శుక్రవారం ఈ అంశాన్ని ఆయన లేవనెత్తారు. కాకతీయులది త్రిపుల్ ట్యాంక్ విధానం.. అంటే టౌన్, ట్యాంక్, టెంపుల్ అని ఆయన వివరించారు. కొడవటంచ గ్రామంలో కాకతీయుల కాలం నాటి లక్ష్మీనరసింహ ఆలయం ఉందని తెలిపారు.
వరంగల్, కరీంగనగర్, ఆదిలాబాద్ జిల్లాల ప్రజలకు అది కొంగుబంగారంగా విరాజిల్లుతున్నట్టు వివరించారు. ఈ క్షేత్రానికి వేలాది మంది భక్తులు వస్తుంటారని, ఇక్కడ ఉన్న చెరువును పూడ్చేశారని తెలిపారు. గ్రామంలో మెజారిటీగా ముదిరాజ్లు ఉన్నారని తెలిపారు. చెరువును పూడ్చటంతో ముదిరాజ్ల ఉపాధి దెబ్బతిన్నదని అన్నారు. ఈ అంశంపై వెంటనే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని, చెరువుకు ప్రత్యామ్నాయాన్ని చూపాలని మధుసూదనాచారి డిమాండ్ చేశారు.