Omega 3 Fatty Acids | మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు కలిగిన ఆహారాలను రోజూ తినాలనే విషయం అందరికీ తెలిసిందే. పౌష్టికాహారాన్ని తీసుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. రోగాలు రాకుండా ఉంటాయి. శరీరంలో జీవక్రియలు సక్రమంగా నిర్వహించబడతాయి. అయితే కొన్ని రకాల పోషకాలను మన శరీరం స్వయంగా తయారు చేసుకుంటుంది. కానీ కొన్నింటిని మాత్రం బయటి నుంచి కచ్చితంగా అందించాల్సి ఉంటుంది. ఆయా పోషకాలను శరీరం తనంతట తానుగా తయారు చేసుకోలేదు. ఇక అలాంటి పోషకాల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఒకటి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వుల జాబితాకు చెందుతాయి. వీటిని మన శరీరం తనంతట తానుగా తయారు చేసుకోలేదు. కనుక ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లభించాలంటే మనం పలు ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. వీటి వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సాధారణంగా 3 రకాలుగా ఉంటాయి. ఈపీఏ, డీహెచ్ఏ అనే రెండు రూపాల్లో ఇవి లభిస్తాయి. ఈ తరహా ఫ్యాటీ యాసిడ్లు మనకు చేపల ద్వారా లభిస్తాయి. అలాగే ఏఎల్ఏ అనే రూపంలోనూ ఇవి మనకు లభిస్తాయి. వీటిని మనం వృక్ష సంబంధిత ఆహారాల ద్వారా పొందవచ్చు. ఇలా ఒమెగా3 ఫ్యాటీ యాసిడ్లు మనకు మూడు రకాలుగా లభిస్తాయి. చేపలు, రొయ్యలు, ఆల్చిప్పలు, ఇతర సముద్రపు ఆహారాలు, అవిసె గింజలు, చియా విత్తనాలు, వాల్ నట్స్, హెంప్ విత్తనాలు, అవిసె గింజల నూనె, సోయాబీన్ నూనె, కనోలా ఆయిల్, కోడిగుడ్లు, పెరుగు, పాలు, సోయా ఆహారాలు వంటి వాటిని తీసుకుంటుంటే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లను సమృద్దిగా పొందవచ్చు. ఇవి మనకు అనేక రకాలుగా ఉపయోగపడతాయి. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తాయి.
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల వల్ల కణాలు సురక్షితంగా ఉంటాయి. గుండె, రక్తనాళాలు, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. ఎండోక్రైన్ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాలను తింటుంటే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బీపీ తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. గుండె అసాధారణ రీతిలో కొట్టుకునే వారు తరచూ ఈ ఆహారాలను తింటుంటే మేలు జరుగుతుంది. అలాగే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. డీహెచ్ఏ వల్ల మెదడు నిర్మాణమవుతుంది. ముఖ్యంగా చిన్నారుల బుద్ధి వికసిస్తుంది. వారు అన్నింట్లోనూ యాక్టివ్గా ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. తెలివి తేటలు పెరుగుతాయి. చదువుల్లో రాణిస్తారు.
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల పెద్దల్లో మెదడు యాక్టివ్ గా మారుతుంది. మెదడు పనితీరు మెరుగు పడుతుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. మతిమరుపు తగ్గుతుంది. వృద్ధాప్యంలో వచ్చే అల్జీమర్స్, డెమెన్షియా వంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి వంటి మానసిక సమస్యలు ఉన్నవారు ఈ ఆహారాలను తరచూ తీసుకుంటుంటే ఎంతో మేలు జరుగుతుంది. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కళ్ల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. వీటి వల్ల కళ్ల రెటీనా సురక్షితంగా ఉంటుంది. కంటి చూపు మెరుగు పడుతుంది. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు యాంటీ ఇన్ ఫ్లామేటరీ కారకాలుగా కూడా పనిచేస్తాయి. అందువల్ల ఈ ఆహారాలను తీసుకుంటే కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. ఆర్థరైటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు చర్మాన్ని సైతం ఆరోగ్యంగా ఉంచుతాయి. పొడిబారిన చర్మానికి తేమను అందిస్తాయి. దీని వల్ల చర్మం సురక్షితంగా ఉంటుంది. కాంతివంతంగా మారి మెరుస్తుంది. ఇలా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. కనుక ఇవి ఉండే ఆహారాలను రోజూ తీసుకుంటుంటే ఎంతగానో మేలు జరుగుతుంది.