Okra | మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో బెండకాయలు కూడా ఒకటి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. చాలా మందికి బెండకాయ వేపుడు అంటే ఇష్టంగా ఉంటుంది. కానీ వేపుళ్లను తినవద్దని వైద్యులు చెబుతుంటారు. వీటిల్లో నూనె అధికంగా వాడుతారు కనుక కూరగాయలను ఎల్లప్పుడూ ఉడికించి మాత్రమే తినాలని సూచిస్తుంటారు. అయితే బెండకాయలను ఇలా తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. బెండకాయల్లో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. ఇవి పలు వ్యాధుల నుంచి మనల్ని బయట పడేస్తాయి. అయితే బెండకాయలను తింటే గణితం సులభంగా వస్తుందని చాలా మంది అంటుంటారు. అందుకనే తమ పిల్లలకు బెండకాయలను కూడా తినిపిస్తుంటారు. మరి ఇందులో వాస్తవం ఎంత ఉంది..? అసలు బెండకాయలను తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయి..? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బెండకాయల్లో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. అనేక విటమిన్లు, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. వీటిల్లో ఉండే విటమిన్ కె గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేస్తుంది. దీంతో తీవ్ర రక్త స్రావం జరగకుండా చూస్తుంది. అలాగే ఎముకలను సైతం దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. బెండకాయల్లో ఉండే విటమిన్ ఎ కంటి చూపు, చర్మానికి మేలు చేస్తుంది. వీటిల్లో మెగ్నిషియం, ఫోలేట్ కూడా అధికంగానే ఉంటాయి. ఇవి శరీర జీవక్రియలు సక్రమంగా నిర్వహించబడేందుకు, కణాల నిర్మాణానికి దోహదపడతాయి.
బెండకాయల్లో ఫైబర్ కూడా అధికంగానే ఉంటుంది. అందువల్ల వీటిని తింటే జీర్ణ వ్యవస్థకు మేలు జరుగుతుంది. ముఖ్యంగా మలబద్దకం తగ్గుతుంది. బెండకాయలు ప్రీ బయోటిక్ ఆహారంగా పనిచేస్తాయి. ఇవి జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందేలా చేస్తాయి. దీంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణాశయ గోడలపై ఉండే మ్యూకస్ పొరకు రక్షణ లభిస్తుంది. దీని వల్ల అసిడిటీ, అల్సర్లు వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు. బెండకాయల్లో ఫైబర్, మ్యుసిలేజ్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో షుగర్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుతాయి. దీని వల్ల మనం తిన్న ఆహారంలో ఉండే పిండి పదార్థాలు గ్లూకోజ్‌గా మారినప్పుడు రక్తంలో చాలా నెమ్మదిగా కలుస్తాయి. దీంతో షుగర్ లెవల్స్ అమాంతం పెరగకుండా ఉంటాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. బెండకాయలను తింటే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. వీటిల్లో ఉండే పొటాషియం బీపీని నియంత్రణలో ఉంచుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. స్ట్రోక్స్ రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
బెండకాయల్లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. పైగా వీటిని తింటే ఫైబర్ అధికంగా లభిస్తుంది. దీని వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. అధికంగా బరువు ఉన్నవారు దాన్ని తగ్గించుకోవాలనుకుంటే తరచూ బెండకాయలను తింటే మంచిది. బెండకాయల్లో అధికంగా ఉండే ఫోలేట్ గర్భిణీలకు మేలు చేస్తుంది. దీని వల్ల గర్భంలో ఉన్న శిశువు ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. అయితే బెండకాయలను తింటే గణితం బాగా వస్తుందని చెప్పడంలో నిజం లేదని, దీన్ని శాస్త్రీయంగా ఇప్పటి వరకు ఎవరూ నిరూపించలేదని పరిశోధకులు చెబుతున్నారు. కానీ బెండకాయల్లో ఉండే పోషకాల వల్ల మెదడు యాక్టివ్‌గా మారి చురుగ్గా పనిచేస్తుంది. బహుశా దీని వల్లే కొందరికి గణితంపై పట్టు లభించి ఉంటుందని, అందుకనే గణితం బాగా రావాలంటే బెండకాయలను తినాలని చెప్పడం ప్రారంభమై ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. కానీ బెండకాయలను తింటే గణితం వచ్చినా రాకున్నా అనేక ఇతర ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయన్న మాట మాత్రం వాస్తవమని వారు చెబుతున్నారు.