Okra Benefits | బెండకాయలు అంటే సహజంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. బెండకాయలను అనేక రకాలుగా వండుకుని తింటుంటారు. బెండకాయలతో ఫ్రై లేదా పులుసు పెట్టుకోవచ్చు. వీటిని టమాటాలతోనూ కలిపి వండుకోవచ్చు. అలాగే సాంబార్లోనూ వీటిని వేస్తుంటారు. బెండకాయలతో చేసే మసాలా కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలా చాలా మంది బెండకాయలను తరచూ తింటుంటారు. అయితే ఆరోగ్యపరంగా చెప్పాలంటే బెండకాయ మనకు ఎన్నో లాభాలను అందిస్తుంది. వీటిల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం బెండకాయను తినడం వల్ల ప్రోటీన్లు, ఫ్యాటీ యాసిడ్లు, అనేక రకాల విటమిన్లతోపాటు ఫైబర్, మినరల్స్ కూడా మనకు లభిస్తాయి.
మీరు ఆరోగ్యవంతమైన ఆహారాలను తీసుకోవాలని చూస్తున్నట్లయితే మీకు బెండకాయ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇది బరువును కంట్రోల్ చేస్తుంది. దీన్ని రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మీరు అధిక బరువును తగ్గాలని చూస్తున్నట్లయితే బెండకాయను తింటే ఆ ప్రయోజనాన్ని పొందవచ్చు .ఎందుకంటే 100 గ్రాముల బెండకాయల ద్వారా సుమారుగా 33 క్యాలరీల శక్తి లభిస్తుంది. బెండకాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయకుండా చేస్తుంది. దీంతో అధికంగా ఆహారం తీసుకోరు. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.
2021లో సైంటిస్టులు చేపట్టిన అధ్యయనం ప్రకారం బెండకాయను తినడం వల్ల బరువు తగ్గడంతోపాటు రక్తంలో చక్కెర స్థాయిలు కూడా తగ్గుతాయని తేల్చారు. అందువల్ల షుగర్ ఉన్నవారికి బెండకాయలు వరమనే చెప్పవచ్చు. వీటిని తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. మలబద్దకం తగ్గుతుంది. బెండకాయలలోని విత్తనాలను తీసి ఎండబెట్టి వాటిని కాఫీకి ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. పూర్వకాలంలో బెండకాయ విత్తనాలతో తయారు చేసిన కాఫీని తాగేవారు. ఈ కాఫీలో కెఫీన్ ఉండదు. కనుక ఇది మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ కాఫీని తాగితే బెండకాయలను తినడం వల్ల కలిగే లాభాలను పొందవచ్చు.
బెండకాయలు ముందుగా ఆఫ్రికాలో పండించబడ్డాయి. అనేక వేల ఏళ్ల కిందట అక్కడ వీటిని సాగు చేశారు. తరువాత ఖండాలు దాటి బెండకాయలు ఇతర దేశాలకు వ్యాప్తి చెందాయి. వీటిని ప్రపంచ వ్యాప్తంగా అనేక రకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. ఆసియాతోపాటు అమెరికాలోనూ విరివిగా బెండకాయలను ఉపయోగిస్తుంటారు. వేడి వాతావరణంలో బెండకాయలు ఎక్కువగా కాస్తాయి. భారత్లో అత్యధికంగా బెండకాయలను పండిస్తున్నారు.
బెండకాయల్లో విటమిన్లు సి, కె, మెగ్నిషియం, ఫోలేట్ సమృద్ధిగా ఉంటాయి. బెండకాయల్లో ఉండే విటమిన్ సి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. ఈ కాయల్లోని విటమిన్ కె ఆరోగ్యకరమైన ఎముకలకు సహాయం చేస్తుంది. ఎముకలను ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుతుంది. అలాగే గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేస్తుంది. దీంతో తీవ్ర రక్త స్రావం అవకుండా చూసుకోవచ్చు. బెండకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా వీటిల్లోని పాలిఫినాల్స్ ఆక్సీకరణ ఒత్తిడిని, వాపులను తగ్గిస్తాయి. దీంతో క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. ఇలా బెండకాయలను తరచూ తినడం వల్ల అనేక అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.