ఊబకాయం, షుగర్ వ్యాధులు.. ఇవి ప్రపంచాన్ని పీడిస్తున్న స్లోపాయిజన్ లాంటి జబ్బులు. ఇవి మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఊబకాయం అనేది పలు రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నది. అతి బరువుతో రోగి సులభంగా కదలలేడు. తన పని తాను చేసుకోలేక అవస్థపడుతుంటాడు. చిన్నపనికి కూడా ఆయాసపడటం, నీరసించిపోవడం.. ఇలా, బతుకంతా భారంగా సాగుతుంటుంది. ఊబకాయం అక్కడితో వదిలిపెట్టదు. గుండెను ప్రమాదంలోకి నెడుతుంది, రక్తపోటును పెంచుతుంది. మరెన్నో వ్యాధులకు కారణమవుతుంది. రోగి బరువు తగ్గించగలిగితే అటు ఊబకాయాన్ని, ఇటు డయాబెటిస్ వ్యాధినీ నియంత్రించవచ్చు. అందుకోసం జీవన శైలి, ఆహారపు అలవాట్లను మార్చుకోవడంతోపాటు వైద్యుల పర్యవేక్షణలో కొన్ని రకాల సూదిమందులు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అసలు ఊబకాయం రావడానికి గల ప్రధాన కారణాలేంటి? దానిని నివారించేందుకు అందుబాటులో ఉన్న చికిత్సా పద్ధతులు, ఇంజెక్షన్లు ఏంటి? వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, దుష్ప్రభావాలు తదితర అంశాలను నేటి ఊపిరిలో తెలుసుకుందాం.
ఊబకాయ సమస్యకు మారుతున్న జీవన విధానమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా యాంత్రిక జీవనానికి అలవాటు పడిన ప్రజల్లో శారీరక శ్రమ తగ్గింది. గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం, బటన్లు నొక్కుతూ, స్క్రీన్లను టచ్ చేస్తూ పనులు చేయడం, నడక పూర్తిగా తగ్గడం ఇలా మనుషులకు శారీరక శ్రమ లేకుండా పోయింది. దీనికి ఆహారపు అలవాట్లు సైతం తోడయ్యాయి. ఫాస్ట్ఫుడ్లు, బర్గర్లు, వేపుళ్లు, బేకరీ ఫుడ్, మాంసాహారం ఇవన్నీ ఊబకాయానికి దారితీస్తున్నాయి. సాంప్రదాయక వంటకాలు తగ్గిపోయాయి. జంక్‌ఫుడ్ తీసుకోవడం విపరీతంగా పెరిగిపోయింది. ఫలితంగా పట్టణాల్లో ఊబకాయ సమస్య నానాటికీ పెరిగిపోతున్నది. అంతేకాకుండా, ఆహార నియమాలు పాటించకపోవడం అంటే సమయానికి ఆహారం తీసుకోకపోవడం కూడా ఊబకాయానికి మరో కారణమని చెప్పవచ్చు.
ఊబకాయం నుంచి విముక్తి పొందాలంటే ముఖ్యంగా జీవన విధానాన్ని మార్చుకోవాలి. ప్రతిరోజూ తప్పనిసరిగా కనీసం అరగంట పాటు వ్యాయామం, వీలైనంతగా నడవడం, యోగాసనాలు చేయడం, మాంసాహారాన్ని తగ్గించడం, కొవ్వు పదార్థాలు, తీపి పదార్థాలకు దూరంగా ఉండటం లాంటివి పాటించాలి. ఎక్కువగా పండ్లు, పండ్ల రసాలు, ఆకు కూరలు, శాకాహారం తీసుకోవడం ఉత్తమం. సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇతర కార్యాలయాల్లో కంప్యూటర్లపై పనిచేసే ఉద్యోగులు గంటకు కనీసం ఒక్కసారైనా లేచి.. పది అడుగులు వేసి, మళ్లీ పని చేసుకోవాలి. ఊబకాయంతో పాటు షుగర్ వ్యాధితో బాధపడే రోగులు ఈ నియమాలు పాటిస్తూనే అందుబాటులో ఉన్న చికిత్స తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

ఇటీవలి కాలంలో బరువు తగ్గడానికి, షుగర్ నియంత్రణకు కొత్త తరహా ఇంజెక్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం వీటిపై ప్రజల్లో ఆసక్తి బాగా పెరుగుతున్నది. ముఖ్యంగా జీఎల్పీ-1 ఎనలాగ్, ఇతర మందులకు డిమాండ్ పెరుగుతున్నది. కానీ, వీటిని వైద్యుల సూచన మేరకు, వారి పర్యవేక్షణలో మాత్రమే వాడాల్సి ఉంటుంది. లేకపోతే లేనిపోని దుష్ప్రభావాలకు గురయ్యే ప్రమాదం ఉంది.
జీఎల్పీ-1 రిసెప్టర్ అగొనిస్ట్స్ అనే ఔషధ వర్గానికి చెందిన ఈ మందులను మొదటగా డయాబెట్స్ మెల్లిటస్ చికిత్స కోసం అభివృద్ధి చేశారు. ఆ తరువాత ఈ ఔషధాలు బరువు తగ్గించడంలో కూడా ఉపయోగకరమని శాస్త్రీయ అధ్యయనాలు నిరూపించాయి. ఈ మందుల వల్ల ఫుడ్ ఇన్‌టేక్ తగ్గుతుంది. అంటే ఆహారం తీసుకునే మోతాదు తగ్గుతుంది. దీంతో ఆటోమెటిక్‌గా బరువు తగ్గడమే కాకుండా షుగర్ వ్యాధి కూడా నియంత్రణలోకి వస్తుంది. ఈ ఇంజెక్షన్లు ఎలా పనిచేస్తాయంటే..
ఊబకాయం, అధిక బరువు, షుగర్ వ్యాధి ఉన్నవారికి, జీవన శైలి, ఆహారపు అలవాట్లు మార్చుకున్నా ఫలితం లేని వారికి జీఎల్పీ-1 ఎనలాగ్ మందులు బాగా పనిచేస్తాయి. అయితే డాక్టర్ల సూచన మేరకు వీటిని వాడాలి. అందరికీ ఈ మందుల అవసరం ఉండదు.
ఈ ఇంజెక్షన్ల వల్ల ప్యాంక్రియాటైటిస్ సమస్య వస్తుందని కొందరిలో ఒక అపోహ ఉంది. కానీ, అది వాస్తవం కాదు. ఇప్పటివరకు జరిగిన శాస్త్రీయ అధ్యయనాల్లో ఈ మందులు వాడిన వారిలో ప్యాంక్రియాటైటిస్ ప్రమాదం పెరిగిందని నిర్ధారణ కాలేదు. అయితే ఇదివరకే ప్యాంక్రియాటైటిస్ నేపథ్యం ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ఈ మందుల వల్ల కళ్ల సమస్యలు, ముఖ్యంగా డయాబెటిక్ రెటినోపతి సమస్యలు పెరుగుతాయనేది మరో అనుమానం. కానీ, అది వాస్తవం కాదు. ఈ మందులు నేరుగా కళ్లను దెబ్బతీయవు. అయితే దీర్ఘకాలంగా అధిక స్థాయిలో షుగర్ ఉన్నవారిలో, చక్కెర స్థాయిలు ఒకసారిగా తగ్గినప్పుడు రెటినోపతిలో మార్పులు కనిపించవచ్చు. అది కూడా తాతాలికమే. అందుకని చెక్కర స్థాయులు నియంత్రణలో ఉండేలా చూసుకుంటూ, క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేసుకోవడం అవసరం.
బరువును తగ్గించే ఇంజెక్షన్లు ఎంతవరకు సుక్షితమనేది చాలామందిలో ఉన్న ప్రశ్న. అయితే, ఏదైన ఔషధాన్ని వైద్యుడి పర్యవేక్షణలో సరైన మోతాదులో వాడితేనే అది సురక్షితం. అలా కాకుండా సొంత నిర్ణయాలతో ఔషధాలు తీసుకుంటే.. అవి ప్రాణాపాయస్థితికి తీసుకెళ్లే ప్రమాదం ఉంటుంది.
బరువు తగ్గించేందుకు వాడే ఈ ఇంజెక్షన్లు కాస్మోటిక్ చికిత్స కాదు. వైద్యుల సలహా లేకుండా ఫార్మసీ నుంచి నేరుగా తీసుకోవడం లేదా ఇతరుల సూచనలతో వాడటం ఆరోగ్యానికి హానికరం. అంతేకాకుండా ఈ ఇంజెక్షన్లు తీసుకున్నంత మాత్రాన బరువు తగ్గడం అనేది సాధ్యం కాదు. జీవనశైలి, ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా సరైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఈ మందులు వాడినప్పుడే సత్ఫలితాలు కలుగుతాయి.
ప్రపంచవ్యాప్తంగా 2.1 బిలియన్ మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. మన దేశంలో వీరి సంఖ్య 30 మిలియన్లకు పైమాటే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అంతేకాదు, ఊబకాయులు అధికంగా ఉన్న దేశాల్లో భారత్ మూడోస్థానంలో ఉంది. ఇక మన హైదరాబాద్ నగర జనాభాలో దాదాపు 20 శాతం మంది అధిక బరువుతో సతమతం అవుతున్నారని పలు వైద్య, ఆరోగ్య గణాంకాలు చెబుతున్నాయి.