Nuts For Diabetes | ప్రపంచ వ్యాప్తంగా ఏటా డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్తో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇది వచ్చేందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అస్తవ్యస్తమైన జీవన విధానాన్ని పాటించడమే ఇందుకు ప్రధాన కారణంగా వైద్యులు చెబుతున్నారు. డయాబెటిస్ వచ్చినవారు డాక్టర్లు ఇచ్చే మందులను క్రమం తప్పకుండా వాడాలి. రోజూ వ్యాయామం చేయాలి. అలాగే సరైన ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా పిండి పదార్థాలు తక్కువగా, ప్రోటీన్లు, కొవ్వులు ఉండే ఆహారాలను ఎక్కువగా తినాల్సి ఉంటుంది. దీంతో డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. అయితే పలు రకాల నట్స్, సీడ్స్ డయాబెటిస్‌ను సమర్థవంతంగా అదుపు చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అందువల్ల వాటిని రోజూ తినాలని వారు సూచిస్తున్నారు.
నట్స్ విషయానికి వస్తే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి జీడిపప్పు. వీటిల్లో కొవ్వు శాతం తక్కువగానే ఉంటుంది. జీడిపప్పులో ఓలియిక్ యాసిడ్ ఉంటుంది. ఇది గుండెకు మేలు చేస్తుంది. జీడిపప్పులో మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. ఇది షుగర్ లెవల్స్‌ను తగ్గించడంలో సహాయం చేస్తుంది. అందువల్ల జీడిపప్పును రోజూ తినాలి. అలాగే రోజూ అవిసె గింజలను తింటున్నా కూడా షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. అవిసె గింజల్లో ఫైబర్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. వీటిని పెనంపై కాస్త వేయించి రోజూ గుప్పెడు మోతాదులో తింటుంటే ఫలితం ఉంటుంది.
గుమ్మడికాయ విత్తనాల్లో విటమిన్ ఇ, కాపర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి1, ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి షుగర్ లెవల్స్‌ను తగ్గించడంలో దోహదపడతాయి. గుమ్మడి కాయ విత్తనాలను కూడా రోజూ గుప్పెడు మోతాదులో తినవచ్చు. డయాబెటిస్తో బాధపడుతున్నవారు రోజూ బాదంపప్పును కూడా తమ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. బాదంపప్పును తింటే ఇన్సులిన్‌ను శరీరం సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. అలాగే వాల్ నట్స్‌ను తింటున్నా కూడా షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ఈ నట్స్‌ను తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇతర నట్స్‌తో పోలిస్తే వీటిల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది షుగర్ లెవల్స్ తగ్గేందుకు దోహదం చేస్తుంది.
మనం తరచూ వంటల్లో వాడే పల్లీల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. కనుక పల్లీలను రోజూ గుప్పెడు తింటుంటే షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. పిస్తా పప్పులో ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఈ పప్పులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయకుండా చేస్తాయి. కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. అలాగే షుగర్ లెవల్స్‌ను సైతం తగ్గిస్తుంది. ఇలా పలు రకాల నట్స్ లేదా గింజలను తినడం వల్ల షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. డయాబెటిస్‌ను అదుపులో ఉంచవచ్చు.