Saffron Water | కుంకుమపువ్వు భారతదేశంలో కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ర్టాల్లో పండుతుంది. దీన్ని కేసర్ అని కూడా పిలుస్తారు. పొద్దునే పరగడుపున కేసర్ నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయంటున్నారు న్యూట్రిషనిస్టులు. క్రమం తప్పకుండా తాగడం వల్ల చర్మం కాంతిమంతంగా మారుతుంది. తాజాదనం సంతరించుకుంటుంది. స్త్రీల విషయంలో అయితే నెలసరి క్రమబద్ధం అవుతుంది. దీనికోసం నెలసరికి కొద్దిరోజుల ముందు నుంచే కేసర్ నీళ్లు తాగాల్సి ఉంటుంది. అయితే, హెవీ పీరియడ్స్ ఉన్నవాళ్లు మాత్రం కేసర్ నీళ్లు తాగకూడదు.
టీ, కాఫీలకు ప్రత్యామ్నాయంగా కేసర్ నీళ్లు ఎంచుకోవడం మంచిది. కుంకుమపువ్వులో ఉండే యాంటి ఆక్సిడెంట్లు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తాయి. అలా వెంట్రుకలు రాలడాన్ని నివారిస్తాయి. ఇక పొద్దునే కేసర్ నీళ్లు తాగడం వల్ల మనసు చక్కెర వైపు మళ్లదట. దీంతో ఊబకాయం ముప్పు తగ్గించుకోవచ్చు.
తయారీ సులువు: కేసర్ నీళ్ల కోసం కప్ ప్రమాణంలో వేడినీళ్లు తీసుకోవాలి. వాటిలో 5 నుంచి 7 కుంకుమపువ్వు పోచలు వేసి, పది నిమిషాలు ఉంచాలి. ఈ నీళ్లను పరగడుపునే సేవించాలి. మంచి ఫలితాల కోసం వరుసగా 15 రోజుల పాటు ప్రయత్నించాలి.