సూదిమందు అంటే భయపడే వాళ్లకంటే భయపడని వాళ్లని లెక్కపెట్టడమే తేలిక. రోగంతో బాధపడేకన్నా కాసేపు నొప్పి భరిద్దామని కొంతమంది భయపడుతూనే సూది వేయించుకుంటారు. కానీ, కొంతమందికి రోగం తీవ్రత కంటే నీడిల్ ఫోబియా తీవ్రతే ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్లు సూది మందులు పక్కనపెట్టేస్తున్నారు. ఇలా వైద్యులు సూచించిన ఇంజెక్షన్లు తీసుకోకపోవడం వల్ల వ్యాధి తీవ్రమవడం, మందులకు లొంగని స్థితికి చేరడం జరుగుతుంది.
ఈ ప్రమాదం గురించి వైద్యులు హెచ్చరించినా పది శాతం రోగులు ఇంజెక్షన్లను పక్కన పెట్టేస్తున్నారట. ‘మందుగోలీలు రాయండి సారూ’ అని భయంకొద్దీ డాక్టర్లను అడుగుతూ ఉండేది ఇలాంటి వాళ్లే. అన్ని రకాల ఔషధాలూ మందుగోలీల రూపంలో ఉండవు. కాబట్టి సూదిమందు తప్పని సరి అన్నా వాళ్లు వినరు. ఇంగ్లండ్‌లో బ్రిటిష్ మెడికల్ అసోసియే
షన్ అధ్యయనంలో పిల్లల్లో 63 శాతం మంది, పెద్దల్లో 25 శాతం మంది నీడిల్ ఫోబియాతో ఉన్నారట. ఈ ఫోబియా లేని దేశం లేదు. నీడిల్ ఫోబియా వల్ల కొంతమంది టీకాలు కూడా తీసుకోవట్లేదు. అందువల్ల సామాజిక లక్ష్యాల కోసం నిర్వహించే వైద్య కార్యక్రమాలు విజయవంతం కావట్లేదు. ఎప్పుడో ఒకసారి సూదిమందు తీసుకునేవాళ్లే అంత భయపడితే.. ఇక రోజూ రక్త పరీక్షలు చేసుకోవాల్సిన వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుంది. దిన దిన గండంగా ఉండే ఈ సూది భయాన్ని పోగొట్టలేక, సూదికి ప్రత్యామ్నాయ ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి.
రక్త పరీక్ష కోసం సూది ఉపయోగించకుండా రక్తాన్ని విశ్లేషించేందుకు బయో మెడికల్ డివైజ్‌ల తయారీ కంపెనీ, రక్త పరీక్షలు నిర్వహించే సంస్థతో కలిసి సూది గుచ్చకుండానే రక్త విశ్లేషణ చేసే పరికరాన్ని రూపొందించింది. నీడిల్ ఫోబియా ఉన్నవారికి ఇది కొంత ఉపశమనమే. కానీ, ఇంజెక్షన్లు మాత్రం సూదితో తీసుకోవాల్సిందే. సూది భయానికి ఇంజెక్షన్లు చేయించుకోకపోతే వచ్చే సమస్యలు అంతకంటే ఎక్కువ బాధ కలిగిస్తాయని చెబుతూ ఈ ఫోబియాను పొగొట్టవచ్చు. లేదా వాళ్లను ఒప్పించవచ్చని వైద్యులు చెబుతున్నారు.