Non Veg Foods Digestion | వయస్సు మీద పడుతున్న కొద్దీ సహజంగానే ఎవరికైనా సరే జీర్ణశక్తి మందగిస్తుంది. యుక్త వయస్సులో ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం ఎంత తిన్నా కూడా సులభంగా జీర్ణం చేసుకోగలుగుతారు. కానీ వృద్ధాప్యం వచ్చాక జీర్ణశక్తి మందగించి ఆహారం సరిగ్గా అవ్వదు. అయితే జీర్ణశక్తి అనేది తీసుకునే ఆహార పదార్థాలను బట్టి కూడా ఉంటుంది. కొందరు ఏ వయస్సులో నాన్ వెజ్ తిన్నా కూడా సులభంగా జీర్ణం చేసుకోగలుగుతారు. కానీ కొందరికి చాలా తక్కువ తిన్నా కూడా నాన్ వెజ్ అంత సులభంగా జీర్ణం కాదు. దీంతో అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలను ఎదుర్కొంటారు. అయితే నాన్ వెజ్ తిన్నప్పుడు అది సులభంగా జీర్ణం అవ్వాలంటే అందుకు గాను కొన్ని ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. దీని వల్ల అజీర్తి తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ సైతం ఆరోగ్యంగా ఉంటుంది. ఆయా చిట్కాలను పాటిస్తే జీర్ణశక్తిని సులభంగా పెంచుకోవచ్చు.
సాధారణంగా మనం తినే ఆహార పదార్థాలను బట్టి అవి జీర్ణం అయ్యే సమయం మారుతుంది. పిండి పదార్థాలు తేలిగ్గా జీర్ణం అవుతాయి. ప్రోటీన్లు, కొవ్వులు ఉండే ఆహారాలు జీర్ణం అవ్వాలంటే అందుకు సమయం పడుతుంది. మాంసాహారంలో ప్రోటీన్లు, కొవ్వులు రెండూ ఉంటాయి. కనుక ఇవి జీర్ణం అయ్యేందుకు చాలా సమయం పడుతుంది. వైద్యులు చెబుతున్న ప్రకారం మాంసాహారం జీర్ణం అయ్యేందుకు సుమారుగా 10 నుంచి 14 గంటల సమయం పడుతుంది. జీర్ణశక్తి తక్కువగా ఉంటే ఈ సమయం ఇంకా పెరుగుతుంది. కొందరికి 24 గంటలు గడిచినా కూడా మాంసాహారం సులభంగా జీర్ణం కాదు. దీంతో గ్యాస్, త్రేన్పులు, అజీర్తి వస్తాయి. అయితే మాంసాహారం సులభంగా జీర్ణం అవ్వాలంటే దాన్ని తిన్న వెంటనే పైనాపిల్ పండ్లను తింటే మంచిది. ఎందుకంటే పైనాపిల్ పండ్లలో ఉండే బ్రొమెయిలిన్ అనే ఎంజైమ్ ప్రోటీన్లు, కొవ్వులను త్వరగా విచ్ఛిన్నం చేస్తుంది. కనుక మాంసాహారం త్వరగా జీర్ణం అవుతుంది. అందువల్ల మాంసాహారం తిన్నవారు సులభంగా జీర్ణం అవ్వాలి అనుకుంటే పైనాపిల్ పండ్లను తింటుండాలి. దీని వల్ల ఎంతో మేలు జరుగుతుంది.
ఇక మాంసాహారం తిన్న తరువాత బొప్పాయి పండ్లను తింటున్నా మేలు జరుగుతుంది. బొప్పాయి పండ్లలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ ప్రోటీన్లు, కొవ్వులను త్వరగా జీర్ణం చేసేందుకు సహాయ పడుతుంది. కనుక మాంసాహారం తిన్న వారికి సులభంగా జీర్ణం అయ్యేందుకు గాను బొప్పాయి పండ్లు కూడా మేలు చేస్తాయి. బొప్పాయి పండ్లను తింటుంటే అజీర్తి, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అయితే వీటిని అతిగా తినకూడదు. రోజుకు ఒక కప్పు మోతాదులోనే తినాల్సి ఉంటుంది. లేదంటే సమస్యలు వస్తాయి. అలాగే మాంసాహారాన్ని వండే ముందు కనీసం 6 గంటల పాటు మారినేట్ చేస్తే మంచిది. దీని వల్ల మాంసం మృదువుగా మారుతుంది. త్వరగా ఉడుకుతుంది. అలాంటి మాంసాన్ని తింటే సులభంగా జీర్ణం కూడా అవుతుంది.
మాంసాహారం తిన్న తరువాత చివర్లో పెరుగు లేదా మజ్జిగను తీసుకుంటే మేలు జరుగుతుంది. ఇవి ప్రోబయోటిక్ ఆహారాలు. అందువల్ల వీటిని తీసుకుంటే జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణశక్తి పెరిగేలా చేస్తుంది. దీని వల్ల ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. అలాగే సోంపు గింజల నీళ్లను తాగుతున్నా కూడా జీర్ణశక్తిని పెంచుకోవచ్చు. ముఖ్యంగా మాంసాహారం తిన్న తరువాత 30 నిమిషాలు ఆగి ఈ నీళ్లను తాగాల్సి ఉంటుంది. దీని వల్ల ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. గ్యాస్ ఏర్పడకుండా ఉంటుంది. అదేవిధంగా మాంసాహారం తిన్న తరువాత వామును నోట్లో వేసుకుని నమిలి మింగాలి. ఇది కూడా అద్భుతంగా పనిచేస్తుంది. దీని వల్ల కూడా ఆహారాన్ని సులభంగా జీర్ణం చేసుకోవచ్చు. జీర్ణాశయంలో గ్యాస్, అసిడిటీ ఏర్పడకుండా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.