Prawns | నాన్ వెజ్ ప్రియులకు ప్రాన్స్ గురించి తెలిసిందే. ఇవి ఖరీదు ఎక్కువగా ఉంటాయి. కనుక చాలా మంది ప్రాన్స్‌ను అంతగా తినరు. కానీ పోషకాల విషయానికి వస్తే మాత్రం చికెన్, మటన్ కన్నా ఎంతో మేలైనవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ప్రాన్స్‌ను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక పోషకాలను పొందవచ్చని, ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని అంటున్నారు. ప్రాన్స్‌ను తరచూ తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు. 100 గ్రాముల ప్రాన్స్‌ను తింటే సుమారుగా 70 క్యాలరీల శక్తి లభిస్తుంది. 15.4 గ్రాముల ప్రోటీన్లు, 0.9 గ్రాముల కొవ్వు, 1 మిల్లీగ్రాము ఐరన్, 1 మిల్లీగ్రాము జింక్, 30 మైక్రోగ్రాముల సెలీనియం, 13 మైక్రోగ్రాముల అయోడిన్, 1.47 గ్రాముల ఉప్పు ఉంటాయి.
ప్రాన్స్‌లో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి. కనుక బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచి ఆహారంగా చెప్పవచ్చు. చికెన్, మటన్ తింటే క్యాలరీలు అధికంగా వస్తాయి. కానీ ప్రాన్స్‌ను తింటే తక్కువ క్యాలరీలు వస్తాయి. పైగా ఎక్కువ సేపు ఉన్నా కడుపు నిండిన భావనతో ఉంటారు. ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. అందువల్ల ఇవి బరువు తగ్గేందుకు ఎంతో దోహదం చేస్తాయి. ప్రాన్స్‌లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. తరచూ వీటిని తింటే కండరాలకు శక్తి లభిస్తుంది. ఎంత పనిచేసినా ఉత్సాహంగా ఉంటారు. యాక్టివ్‌గా అనిపిస్తుంది. రోజంతా శక్తి స్థాయిలు అలాగే ఉంటాయి. నీరసం, అలసట ఉండవు. కండరాల నిర్మాణానికి ప్రాన్స్ ఎంతో దోహదం చేస్తాయి. రోజూ శారీరక శ్రమ చేసే వారు, జిమ్ లేదా వ్యాయామం చేసే వారు ప్రాన్స్‌ను తింటే మేలు జరుగుతుంది.
ప్రాన్స్‌లో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఆస్టాజాంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ వీటిల్లో అధికంగా ఉంటుంది. ఇది యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటుంది. కనుక ప్రాన్స్ ను తింటే ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కీళ్లు, మోకాళ్ల నొప్పులు, వాపులు ఉన్నవారు తరచూ ప్రాన్స్‌ను తింటుంటే ఎంతో ఉపశమనం లభిస్తుంది.ప్రాన్స్‌లో విటమిన్ బి12 అధికంగా ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాల తయారీకి, నాడీ మండల వ్యవస్థ పనితీరుకు దోహదం చేస్తుంది. ప్రస్తుతం చాలా మంది విటమిన్ బి12 లోపంతో బాధపడుతున్నారు. దీంతో మెడ, భుజాల్లో నొప్పులు వస్తున్నాయి. అయితే సమస్య నుంచి బయట పడేందుకు ప్రాన్స్ అద్భుతంగా పనిచేస్తాయి. ప్రాన్స్‌ను తరచూ తింటే విటమిన్ బి12 సమృద్ధిగా లభిస్తుంది. దీంతో ఈ విటమిన్ లోపం నుంచి బయట పడవచ్చు.
ప్రాన్స్‌లో ఉండే ఐరన్ రక్తం తయారయ్యేలా చేస్తుంది. రక్తహీనత ఉన్నవారు తరచూ వీటిని తింటే ఎంతో మేలు జరుగుతుంది. ప్రాన్స్‌లో కొవ్వు చాలా స్వల్ప మోతాదులో ఉంటుంది. చికెన్, మటన్ తింటే కొవ్వు పెరిగి శరీరంలో కొలెస్ట్రాల్ తయారవుతుంది. కానీ ప్రాన్స్ అలా కాదు. వీటిని నిరభ్యంతరంగా తినవచ్చు. ప్రాన్స్‌లో ఉండే జింక్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పురుషులు ప్రాన్స్‌ను తరచూ తింటే వారిలో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. శృంగారంలో చురుగ్గా పాల్గొంటారు. చర్మం, శిరోజాల సంరక్షణకు కూడా జింక్ ఎంతో మేలు చేస్తుంది. ప్రాన్స్‌లో ఉండే సెలీనియం షుగర్ ఉన్నవారికి మేలు చేస్తుంది. తరచూ వీటిని తింటే షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. ప్రాన్స్‌లో ఉండే అయోడిన్ థైరాయిడ్ ఉన్నవారికి మేలు చేస్తుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగు పరుస్తుంది. ఇలా ప్రాన్స్‌ను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.