మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Health - Jul 22, 2020 , 00:28:00

వర్షాకాలంలో తప్పనిసరిగా తినాల్సిన పండ్లు

 వర్షాకాలంలో తప్పనిసరిగా తినాల్సిన పండ్లు

హైదరాబాద్: వర్షాకాలం సీజన్‌లో రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు కొన్ని ప్రత్యేక పండ్లు తినాలి. ఎందుకంటే వర్షాకాలంలో వచ్చే కొన్ని వ్యాధులను దూరంగా ఉంచేందుకు మనకు అందుబాటులో ఉండే ఈ పండ్లు ఎంతగానో దోహదపడుతాయి. అవేంటో చూద్దాం... 

నేరేడు పండ్లు వర్షాకాలంలో ఎక్కువగా దొరుకుతాయి. ఇందులో కేలొరీలు తక్కువగా ఉంటాయి. ఇనుము, ఫోలేట్‌, పొటాషియం, విటమిన్లు అధికంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు నేరేడును తీసుకోవాలి. అజీర్తి సమస్యను ఇవి తగ్గిస్తాయి. యాపిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. వర్షాకాలంలో జీవక్రియల రేటు కాస్త నిదానంగా ఉంటుంది. దీంతో శరీరం కూడా చురుగ్గా ఉండదు. కావున యాపిల్‌ తింటే ఆరోగ్యంగా, చురుగ్గా కూడా ఉంటారు.

రోగనిరోధక శక్తి పెంచడంలో దానిమ్మ కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి వర్షాకాలంలో పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ రోజూ దానిమ్మ పండు తింటే ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు. విటమిన్‌ ‘సి’ అధికంగా లభించే బొప్పాయి కూడా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వానాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో పీచు ఎక్కువ. అయితే బొప్పాయిని మితంగా తీసుకుంటేనే మంచిదని పోషకాహారానిపుణులు సూచిస్తున్నారు. అరటిపండులో విటమిన్లూ, మినరల్స్ అధికంగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థను శుభ్రం చేసే శక్తి అరటికి ఉంది. అజీర్తి సమస్య ఉండదు. పిల్లలకు రోజూ ఓ పండు తినిపించాలి. దీంతో శరీరానికి శక్తి అందడమే కాదు, పొట్ట నిండిన భావన కూడా కలుగుతుంది.



logo