Mulberry Fruits | స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, క్రాన్ బెర్రీ.. ఇలా అనేక రకాల బెర్రీ పండ్ల గురించి మీరు వినే ఉంటారు. ఆయా పండ్లను చూసి కూడా ఉంటారు. కానీ మల్బెర్రీ పండ్లను మీరు ఎప్పుడైనా చూశారా..? ఈ పేరును చాలా మంది వినే ఉంటారు. కానీ ఈ పండ్లను చూసి ఉండరు. మనకు రహదారుల పక్కన లేదా స్టోర్స్‌లో మల్బెర్రీ పండ్లను బాక్సుల్లో పెట్టి విక్రయిస్తుంటారు. ఇవి ఎంతో తియ్యగా ఉంటాయి. చూసేందుకు ఆకర్షణీయంగా కూడా ఉంటాయి. అనేక పోషకాలను కలిగి ఉంటాయి. మల్బెర్రీ పండ్లు సాధారణంగా తెలుపు, ఎరుపు, బ్లాక్ రంగుల్లో ఉంటాయి. అయితే ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. మల్బెర్రీ పండ్లలో ఆంథో సయనిన్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
రెస్వెరెట్రాల్, ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఈ బెర్రీ పండ్లలో అధికంగానే ఉంటాయి. ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్ నిర్మూలించబడతాయి. గుండె జబ్బులు, క్యాన్సర్, నాడీ సంబంధ వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. మల్బెర్రీ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. దీంతో శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. రోగాల నుంచి మనల్ని సురక్షితంగా ఉంచుతుంది. మల్బెర్రీ పండ్లలో ఉండే రెస్వెరెట్రాల్ అనే సమ్మేళనం శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇదే పోషక పదార్థం రెడ్ వైన్‌లోనూ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. గుండె కండరాలు వాపులకు గురి కాకుండా చూస్తుంది. రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ అదుపులో ఉంటాయి.
మల్బెర్రీ పండ్లను తినడం వల్ల ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది పేగుల్లో మలం కదలికలను సులభతరం చేస్తుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మల్బెర్రీ పండ్లలో 1-డిఆక్సీనోజిరిమైసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కార్బొహైడ్రేట్లను శరీరం త్వరగా గ్లూకోజ్‌గా మార్చకుండా చూస్తుంది. దీంతో షుగర్ లెవల్స్ పెరగవు, నియంత్రణలో ఉంటాయి. అందువల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. షుగర్ ఉన్నవారికి ఈ పండ్లు ఎంతో మేలు చేస్తాయి. మల్బెర్రీ పండ్లలో జియాజంతిన్, లుటీన్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. కళ్లు ఆక్సీకరణ ఒత్తిడికి గురి కాకుండా చూస్తాయి. దీంతో వయస్సు మీద పడడం వల్ల వచ్చే శుక్లాలు రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే ఈ పండ్లలో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగు పరుస్తుంది.
మల్బెర్రీ పండ్లలో బయో యాక్టివ్ సమ్మేళనాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. దీని వల్ల శరీరంలోని వాపులు, నొప్పులు తగ్గిపోతాయి. ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. మల్బెర్రీ పండ్లలో ఉండే ఆంథో సయనిన్స్, రెస్వెరెట్రాల్ అనే సమ్మేళనాల్ల క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకోవచ్చు. పలు రకాల క్యాన్సర్లు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. మల్బెర్రీ పండ్లలో విటమిన్ కె, క్యాల్షియం, ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ పండ్లన తినడం వల్ల ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది రక్తం తయారయ్యేలా చేస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. ఇలా మల్బెర్రీ పండ్లను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.