ప్రపంచవ్యాప్తంగా కల్తీ ఆహారం తిన్న కారణంగా రోజుకు దాదాపు లక్షలాది మంది జబ్బు పడుతున్నారట. ప్రపంచ ఆరోగ్య సంస్థ జూన్ 7న ‘ప్రపంచ ఆహార భద్రత దినం’ సందర్భంగా పేర్కొన్న ఈ విషయం ఆందోళన కలిగించే అంశం. ఇక కల్తీ ఆహారం కాటుకు గురయ్యేవారిలో నలభై శాతం వరకు ఐదేండ్ల లోపు చిన్నారులే ఉంటున్నారు. ఆహారం నాణ్యత పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరాన్ని ఇది నొక్కి చెబుతున్నది.
కాగా, కల్తీ ఆహారం కారణంగా జరుగుతున్న ఆర్థిక నష్టమైతే పదకొండు వేల కోట్ల డాలర్ల వరకు ఉంటుందని అంచనా. ఇది కూడా ప్రధానంగా అల్ప, మధ్యాదాయ దేశాల్లో ఉండటం గమనార్హం. ఇది ఉత్పాదకత మీదనే కాకుండా ఆరోగ్య వ్యవస్థల మీద కూడా తీవ్రమైన దుష్ప్రభావం చూపుతుంది. కల్తీ ఆహారం కారణంగా ప్రతి ఏటా సుమారు పదిహేను కోట్ల మంది జబ్బు పడుతుంటే, 1,75,000 మంది మరణిస్తున్నారని అంచనా.
ఇక ఆహార కల్తీకి కారణాలు ఎన్నో! ముఖ్యంగా వేడి వాతావరణంలో చీడపీడల బాధ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆహార పదార్థాలపై సహజంగానే టాక్సిన్లు ఏర్పడటానికి దారితీస్తుంది. పైగా వాతావరణంలో సంభవిస్తున్న అనూహ్యమైన మార్పులు కూడా ఆహార కల్తీకి కారణమవుతున్నాయి. కాబట్టి, “ఆహార భద్రత అనేది ప్రభుత్వాలు, ఉత్పత్తిదారులు, వినియోగదారుల ఉమ్మడి బాధ్యత.
తినే తిండి నాణ్యత విషయంలో అందరికీ పాత్ర ఉంటుంది” అంటారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ విభాగం డైరెక్టర్ సయీమా వాజెద్. అందరూ భద్రతా చర్యలు తీసుకుంటేనే ప్రజల ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన పోషకాహారం అందుబాటులో ఉంటుంది.