మైగ్రేన్ (పార్శపునొప్పి) చిన్నపిల్లలకు ఓ సవాలు లాంటిది. పార్శపునొప్పి కారణంగా బడి వేళల్లో పిల్లలు చాలా ఇబ్బందిపడతారు. తరగతిలో ఏకాగ్రత కుదరదు. మూడ్ పాడైపోతుంది. దీన్ని తట్టుకోవడం పిల్లలకు తలకుమించిన పనైపోతుంది. కొన్ని చిట్కాలను అనుసరిస్తే పిల్లలు మైగ్రేన్ బాధ, అసౌకర్యం నుంచి తప్పించుకోవచ్చు.
మైగ్రేన్ కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల వస్తుంది. తీవ్రమైన కాంతి, పెద్ద శబ్దాలు, శరీరంలో డీహైడ్రేషన్ వంటివాటితోపాటు చాక్లెట్లు, ప్రాసెస్ చేసిన పదార్థాలతో తయారుచేసిన స్నాక్స్ లాంటివీ కారణం కావొచ్చు. వీటిని గుర్తించి తగినచర్యలు తీసుకోవాలి. తీవ్రమైన కాంతినిచ్చే బల్బులకు దూరంగా కూర్చోవడం, తక్కువ శబ్దం వచ్చేలా పరిసరాలను మార్చుకోవడంతో బడి వేళల్లో మైగ్రేన్ ముప్పును తగ్గించుకోవచ్చు.
పిల్లలు తరగతులు, ఆటల్లో పడిపోయి సరిగ్గా నీళ్లు తాగడం మర్చిపోతారు. కాబట్టి బడికి వెళ్లేటప్పుడు నీళ్లసీసా వెంట తీసుకెళ్లమని గుర్తుచేయాలి. రోజులో తరచుగా నీళ్లు తాగుతూ ఉండమని సూచించాలి. బడిలో కూడా నీళ్లు తాగడానికి విరామం ఇవ్వాలి. శరీరంలో తగినంత హైడ్రేషన్ ఉంటే తలనొప్పికి ఆస్కారం ఉండదు.
తలనొప్పిగా అనిపించినప్పుడు పిల్లలు కాసేపు విరామం తీసుకోవాలి. నిశ్శబ్దంగా ఉండే ప్రదేశంలో కూర్చోవాలి. నొప్పి పోయేవరకు కండ్లకు విశ్రాంతినివ్వాలి.
మైగ్రేన్స్కు ఒత్తిడి కూడా ఓ కారణమే. బళ్లలో కూడా పిల్లలకు ఒత్తిడి వాతావరణం ఉంటుంది. కాబట్టి, గట్టిగా గాలి పీల్చుకోవడం, విజువలైజ్ చేసుకోవడం లాంటి వ్యాయామాలను పిల్లలు చేస్తూ ఉండాలి. దీంతో ఒత్తిడి కాస్త తగ్గిపోతుంది. తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
తిండి సరిగ్గా తినకపోవడం, చక్కెరలు ఉన్న ఆహారం, ప్రాసెస్డ్ చిరుతిండ్లు కూడా మైగ్రేన్‌కు దారితీస్తాయి. అందుకని పిల్లలకు ఆరోగ్యకరమైన పోషకాలతో కూడిన ఆహారాన్నే పెట్టాలి. మెగ్నీషియం పుష్కలంగా ఉండే గింజలు, ఆకుకూరలు లాంటివి మైగ్రేన్‌ను నివారిస్తాయి. మంచి ఆహారాన్ని నియమిత వేళల్లో తీసుకుంటే తలనొప్పి ముప్పు తగ్గిపోతుంది.